కలిసికట్టుగా పనిచేస్తే మళ్లీ ఘన విజయం 

14 Oct, 2022 03:54 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ఆలూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం 

మరో 18–19 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు.. ఈ రోజు నుంచే సన్నద్ధం  

మూడేళ్లలో మీ నియోజకవర్గం లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1,050 కోట్లు  

చేసిన మంచిని వివరించడానికే ‘గడప గడపకు మన ప్రభుత్వం’   

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో అధికారంలో ఉన్న మనమంతా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం. మనమంతా కలిసికట్టుగా పని చేస్తే మళ్లీ ఘన విజయం సాధిస్తాం’ అని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన వారితో సమావేశమయ్యారు.

నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో మాట్లాడటానికే ఈ కార్యక్రమం చేపట్టామని, ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మరో 18–19 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని.. వాటికి ఈ రోజు నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మూడేళ్లలోనే సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో ఒక్క ఆలూరు నియోజకవర్గంలోని లబ్ధిదారులకు రూ.1,050 కోట్లు జమ చేశామని వివరించారు.

చేసిన మంచి కార్యక్రమాలను వివరించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవడం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వారంలో రెండు రోజులు.. ప్రతి రోజూ కనీసం రెండు గంటల పాటు ఎమ్మెల్యే ప్రజల మధ్య గడుపుతున్నారని చెప్పారు. 

ప్రాధాన్యత పనుల కోసం రూ.20 లక్షలు 
ప్రతి ఇంటికీ వెళ్లి.. ఆ కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా జరిగిన మేలును వివరించి.. మేలు జరిగిందా? లేదా? అని విచారిస్తూ వారి ఆశీస్సులు తీసుకుంటున్నామని సీఎం కార్యకర్తలకు వివరించారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే.. వాటిని తక్షణమే సరిదిద్దుతున్నామని తెలిపారు. ప్రజల సాధక బాధకాలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా కొనసాగుతోందన్నారు. దేవుడి దయవల్ల ఈ కార్యక్రమం బాగా సాగుతోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో వచ్చిన వినతుల్లో ప్రాధాన్యత పనుల కోసం రూ.20 లక్షలు కేటాయించి.. వాటిని పూర్తి చేస్తున్నామని వివరించారు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండాలని మార్గ నిర్దేశం చేశారు. వీలైనప్పుడల్లా తాను ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసంగా 100 మంది కార్యకర్తలను కలుస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం తదితరులు పాల్గొన్నారు.    

వరద బాధితులకు అండగా నిలవండి
సాక్షి, అమరావతి: అనంతపురంలో భారీ వ ర్షాలు, వరద బాధితులందరికీ అండగా నిల వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికా ర యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.రెండువేల చొప్పున తక్షణ సహాయం అందించాలని చెప్పారు. ఉచితం గా 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్‌ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ ఆలుగడ్డలు చేరవేయాలన్నారు.

వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంటనష్టం పై అంచనాలు తయారుచేసి, నిర్ణీత సమ యంలోగా వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంత పురంలో భారీవర్షాలు, అనంతర పరిస్థితు లపై గురువారం ఆయన తన క్యాంపు కార్యా లయంలో సమీక్షించారు. అనంతపురంలో వర్షం.. ప్రస్తుత పరిస్థితులు, సహాయక చర్య లు, బాధితులను ఆదుకునే కార్యక్రమాల గురించి అధికారులు సీఎంకు వివరించారు.  

తక్షణ సాయం కోసం రూ.93 లక్షలు 
అనంతపురంలో వరద బాధితులను తక్షణం ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.93 లక్షలు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

నిత్యావసరాల పంపిణీ, సహాయక శిబిరాల నుంచి కుటుంబాలు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు రూ.2 వేల చొప్పున సాయం చేసేందుకు సంబంధించి మరో రెండు జీవోలు విడుదల చేశారు. వరద బాధితుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్‌తో స మన్వయం చేసుకుంటూ వరద బాధితులకు నిత్యావసరాలను సరఫరా చేయాలని పౌరస రఫరాలశాఖ కమిషనర్‌ను ఆదేశించారు.   

మరిన్ని వార్తలు