మరో 24 గంటలు.. అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశం

17 Jul, 2022 04:03 IST|Sakshi

అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: గోదావరి వరద నేపథ్యంలో మరో 24 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలన్నీ చేపట్టాలని స్పష్టం చేశారు. గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్‌ శనివారం ఉదయం సమీక్షించారు. గోదావరి ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సహాయ బృందాలను వినియోగించుకుంటూ శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్దేశించారు.  

రేషన్‌ సరుకులు.. నగదు సాయం 
వరద బాధిత కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికన రేషన్‌ పంపిణీ చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి కుటుంబానికీ 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో  బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కిలో ఉల్లిపాయలు అందించాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికైతే రూ.వెయ్యి చొప్పున వెంటనే నగదు సాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ వరద పరిస్థితిపై గంట గంటకూ తనకు నివేదించాలని అధికారులను ఆదేశించారు.   

మరిన్ని వార్తలు