అన్నదాతకు అండ.. గింజగింజకూ మద్దతు

12 Oct, 2022 02:55 IST|Sakshi

పంటల కొనుగోలులో రైతన్నలకు అండగా నిలవాలి: సీఎం వైఎస్‌ జగన్‌

ఎక్కడైనా ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరలుంటే తక్షణమే జోక్యం 

సీఎం యాప్‌ ద్వారా ఫిర్యాదు అందగానే స్పందించేలా ఎస్‌ఎల్‌ఏ 

ఈ–క్రాపింగ్‌తో ధాన్యం కొనుగోళ్లలో పూర్తి స్థాయిలో పారదర్శకత 

15 కల్లా రైతుల అథంటికేషన్‌ పూర్తి చేసి రశీదులు 

ఆర్బీకే మిత్రలు, రైతు సహాయకులుగా వలంటీర్లు

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

గన్నీ బ్యాగులు, హమాలీలతో సహా అన్నీ సిద్ధం చేసుకోవాలి

బియ్యం ఎగుమతులపైనా దృష్టి సారించాలి

ఇథనాల్‌ తయారీకి రంగు మారిన ధాన్యం, బ్రోకెన్‌ రైస్‌ వినియోగం

ఏటా ఖరీఫ్‌కు ముందే భూసార పరీక్షలు.. ఆర్బీకేల్లో టెస్టింగ్‌ డివైజ్‌లు 

భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా పంటల సాగు, ఎరువుల వినియోగం

వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, ధాన్యం సేకరణ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్ష

అన్నదాతలు పండించే ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ ఒక్క రైతన్న కూడా ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం లేకుండా పంటల కొనుగోళ్ల సమయంలో వారికి అన్ని విధాలా అండగా నిలవాలి.
– అధికార యంత్రాంగానికి సీఎం జగన్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంటనూ ఈ–క్రాపింగ్‌ చేయడం వల్ల ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారు? ఎంత దిగుబడి వస్తుందనే విషయంలో స్పష్టత వచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో పూర్తి స్థాయిలో పారదర్శకత వచ్చిందన్నారు. పంటల నమోదు నూరు శాతం పూర్తి కాగా, వీఏఏ, వీఆర్‌వోల ద్వారా ఈ – కేవైసీ 99 శాతం పూర్తైనందున ఈనెల 15వ తేదీలోగా రైతుల ఈ – కేవైసీ (వేలిముద్రలు) పూర్తిచేసి ప్రతి రైతుకు డిజిటల్, ఫిజికల్‌ రశీదులివ్వాలని సూచించారు.

పంటల కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా నిర్దేశించుకున్న షెడ్యూల్‌ ప్రకారం సోషల్‌ ఆడిట్‌ పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో పాటు ఖరీఫ్‌ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ మంగళవారం సమీక్షించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం
ఖరీఫ్‌ సీజన్‌ దాదాపుగా పూర్తైంది. కోతలు మొదలయ్యేలోగా కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి. కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు. గన్నీ బ్యాగులు, కూలీలు, రవాణా సదుపాయాలను అవసరమైన మేరకు  సమకూర్చుకోవాలి.

ధాన్యం కొనుగోళ్లపై ఆర్బీకేల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ధాన్యం కొనుగోళ్ల కోసం చేసిన ఏర్పాట్లు, నిబంధనలు,  సూచనలు, సలహాలతో ఆర్బీకేల్లో పోస్టర్లు ప్రదర్శించాలి. ఆర్బీకేలకు అనుసంధానించిన వలంటీర్లు ఆర్బీకే మిత్రలుగా, ధాన్యం కొనుగోళ్లలో సహాయం కోసం తీసుకుంటున్న వలంటీర్లు రైతు సహాయకులుగా వ్యవహరించాలి.

బియ్యం ఎగుమతులపై దృష్టి
రాష్ట్రంలో వరి విస్తారంగా సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపై దృష్టి సారించాలి. దేశీయంగా డిమాండ్‌ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను పరిశీలించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎగుమతుల రంగంలో ఉన్న వారితో కలిసి పని చేయాలి.

బియ్యం ఎగుమతిదారులకు, రైతులకు ఉభయ తారకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రంగు మారిన ధాన్యం, బ్రోకెన్‌ రైస్‌ (నూకలు)ఇథనాల్‌ తయారీకి వినియోగించడంపై దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఇఫ్కో ద్వారా ఒక ప్లాంటు, మహీంద్రా ద్వారా మరో ప్లాంటు నుంచి ఇథనాల్‌ తయారు కానుంది.

సీఎం యాప్‌తో ధరల పర్యవేక్షణ
ఎక్కడైనా పంటలకు ఎమ్మెస్పీ కంటే తక్కువ ధర ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే జోక్యం చేసుకుని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. పంట ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు సీఎం యాప్‌ ద్వారా సమీక్షిస్తుండాలి. ఎక్కడైనా ధర పతనమైనట్లు సీఎం యాప్‌ ద్వారా గుర్తిస్తే వెంటనే కొనుగోళ్లకు శ్రీకారం చుట్టాలి. ధర పతనమైన సందర్భాల్లో రైతులను ఎలా ఆదుకుంటామనే విషయంలో సర్వీస్‌ లెవల్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌ఎల్‌ఏ) పకడ్బందీగా ఉండాలి.

కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను నిల్వచేసే ప్రాంతంలో జియో ఫెన్సింగ్, ప్రతి ఉత్పత్తికి ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ ఉండేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేయాలి. రైతులను ఆదుకునేందుకు మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలి. దీనివల్ల ధరలు పతనం కాకుండా అన్నదాతలకు మేలు జరుగుతుంది. పొగాకు రైతులకు నష్టం జరగకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలి.

ఖరీఫ్‌కు ముందే భూసార పరీక్షలు.. పంటల సంరక్షణకు ప్లాంట్‌ డాక్టర్‌
ఏటా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాకముందే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు నిర్వహించి పూర్తి వివరాలను సాయిల్‌ హెల్త్‌ కార్డుల్లో నమోదు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా పంటల సాగుకు సంబంధించి సిఫార్సులు చేయాలి. ఏ నేలలో ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే అంశంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇందుకోసం ప్రతి ఆర్బీకేలో సాయిల్‌ టెస్టింగ్‌ పరికరాలను అందుబాటులో ఉంచాలి.

మధ్యలో ఏవైనా చీడపీడలు, తెగుళ్లు లాంటివి పంటలకు సోకితే ఫోటోలు తీసి శాస్త్రవేత్తల సహకారంతో నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్లాంట్‌ డాక్టర్‌ విధానాన్ని తేవాలి. విచ్చలవిడిగా క్రిమి సంహారక మందుల వాడకాన్ని నివారించాలి. ఇలా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తూ సిఫార్సుల మేరకు పంటలను సాగు చేస్తే విచక్షణా రహితంగా ఎరువులు, రసాయనాల వాడకం తగ్గుతుంది. తద్వారా రైతన్నలకు పెట్టుబడి వ్యయం తగ్గడంతోపాటు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించేందుకు దోహదం చేస్తుంది. 

ఈదఫా 1.15 కోట్ల ఎకరాల్లో సాగు 
ఖరీప్‌ సీజన్‌లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా అక్కడక్కడా వరి నాట్లు కొనసాగుతున్నందున ఈదఫా ఖరీఫ్‌ సాగు 1.15 కోట్ల ఎకరాలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు సీఎం దృష్టికి తెచ్చారు. మూడేళ్లలో 3.5 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు పెరిగిందని, సాధారణ పంటల నుంచి రైతులు వీటి వైపు మళ్లినట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 14.10 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారని చెప్పారు.

నవంబర్‌ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం 3,423 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మాయిశ్చరైజర్‌ మీటర్, అనాలసిస్‌ కిట్,  హస్క్‌ రిమూవర్, పోకర్స్, ఎనామెల్‌ ప్లేట్స్, జల్లించే పరికరాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. రానున్న రబీ సీజన్‌లో 57.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేసి 96 లక్షల టన్నుల విత్తనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు.

వైఎస్సార్‌ యంత్రసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన పరికరాలు, అద్దెల వివరాలతో ఆర్బీకేల్లో పోస్టర్లను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత సాయాన్ని అక్టోబరు 17న అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భూసార పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు బాంబే, కాన్పూర్‌ ఐఐటీల సాంకేతిక విధానాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.

సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖల కమిషనర్లు చేవూరు హరికిరణ్, హెచ్‌.అరుణ్‌కుమార్, పీఎస్‌ ప్రద్యుమ్న, పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు