త్వరితగతిన సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం

19 May, 2023 04:25 IST|Sakshi

గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

పట్టాలు పంపిణీ చేసిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలి

నిరుపేదలకు త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ 

ఇళ్లు సమకూరిస్తే వారి జీవితాలు త్వరగా బాగుపడతాయి

గత 45 రోజుల్లో హౌసింగ్‌ కోసం రూ.1,085 కోట్ల ఖర్చు 

3.70 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి 

రూఫ్‌ లెవల్, ఆపై దశల్లో 5.01 లక్షల ఇళ్లు ∙రూ.35 వేల చొప్పున రూ.3,886.76 కోట్ల రుణాలు 

సాక్షి, అమరావతి: క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌­మెంట్‌ అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి కాగానే నిర్మా­ణాలు మొదలు పెట్టాలన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.

ఈ క్రమంలో అధికారులు పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పేదలకు ఎంత త్వరగా పక్కా ఇళ్లను సమకూరిస్తే వారి జీవితాలు అంత త్వరగా బాగు పడతాయన్నారు. సీఆర్డీఏ పరిదిలో పేదలకు పంపిణీ చేస్తున్న స్థలాల్లో వేగంగా పనులు చేపట్టాలని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు.

పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం గత 45 రోజుల్లో రూ.1,085 కోట్లు ఖర్చు చేసిందని, ఇప్పటికే 3.69 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రూఫ్‌ లెవల్, ఆపై దశలో ఉన్న ఇళ్ల త్వరలోనే పూర్తి అవుతాయన్నారు. మరో 8.64 లక్షల ఇళ్లు బేస్‌మెంట్‌ ఆపై దశల్లో ఉన్నాయన్నారు. వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. గత సమీక్షలో సీఎం జారీ చేసిన ఆదేశాలను అమలు చేశామని తెలిపారు. ‘జగనన్నకు చెబుదాం’ స్పెషల్‌ ఆఫీసర్లను కూడా వైఎస్సార్, జగనన్న కాలనీల్లో నియమించి, ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నామని వివరించారు.

బ్యాంకుల నుంచి త్వరితగతిన రుణాలు
ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఇలా ఇప్పటి వరకూ 11.03 లక్షల మందికి పావలా వడ్డీతో రూ.35 వేల చొప్పున రుణాలిప్పించామని.. రూ.3,886.76 కోట్ల మేర రుణాలు మంజూరు అయ్యాయని తెలిపారు. సీఆర్డీఏలో ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, భూమి చదును చేసే పనులు చేశామన్నారు.

ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మాణం పూర్తయిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్న కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్‌ జైన్, శ్రీలక్ష్మి, విజయానంద్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ సాయి ప్రసాద్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ లక్ష్మిషా, మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు