మరింత ఉధృతంగా వ్యాక్సినేషన్‌  

30 Nov, 2021 02:22 IST|Sakshi
క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

డిసెంబర్‌ నెలాఖరు కల్లా 2 కోట్ల డోసులు పూర్తవ్వాలి 

కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్లను త్వరగా వినియోగించాలి 

డోర్‌ టూ డోర్‌ వ్యాక్సినేషన్‌.. క్రమం తప్పకుండా ఫీవర్‌ సర్వే  

ఏపీకి వచ్చే వారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌  

మాస్క్‌ల విషయంలో మళ్లీ స్పెషల్‌ డ్రైవ్‌ 

ఆక్సిజన్‌ పైప్‌లైన్లు, ఆస్పత్రుల్లో వసతులను పరీక్షించి వైద్య సిబ్బందిని సన్నద్ధం చేయాలి 

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలు   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. టార్గెట్‌ నిర్దేశించుకుని మరీ వ్యాక్సినేషన్‌ చేపట్టాలని నిర్దేశించారు. వ్యాక్సినేషన్‌ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతామన్నదే మన ముందున్న లక్ష్యమని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ విషయంలో దూకుడుగా ఉండడం చాలా ముఖ్యమన్నారు. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్‌ నెలాఖరుకల్లా రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ (ఇంకా మొదటి డోసు కూడా తీసుకోని వారు, రెండో డోసు తీసుకోవాల్సిన వారితో కలిపి) పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోవాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్‌లో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, కేంద్రం నుంచి వస్తున్న టీకాలను వీలైనంత త్వరగా వినియోగించాలని పేర్కొన్నారు. డోర్‌ టూ డోర్‌ వ్యాక్సినేషన్, క్రమం తప్పకుండా ఫీవర్‌ సర్వే చేపట్టాలని ఆదేశించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 

విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌... 
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో స్పెషల్‌ మెడికల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ చేయాలి. ర్యాపిడ్‌ టెస్టులు కాకుండా ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు మాత్రమే నిర్వహించాలి.  

మాస్క్‌లపై మళ్లీ డ్రైవ్‌.. 
అందరూ మాస్క్‌లు ధరించేలా చర్యలు చేపట్టి మళ్లీ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలి. ప్రజలు గుమిగూడకుండా చూడాలి. గతంలో ఉన్న నిబంధనలు అమలు చేయాలి. అవగాహన, అప్రమత్తత రెండూ ముఖ్యం. మాస్క్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ వెంటనే పాటించాలి. 

ఆక్సిజన్‌ పైప్‌ లైన్లు పరీక్షించాలి.. 
ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైప్‌లైన్లు సరిగ్గా ఉన్నాయా? డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా? గతంలో కోవిడ్‌ చికిత్స కోసం వినియోగించిన అన్ని ఆసుపత్రులలో సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా? ఇవన్నీ సరి చూసుకోవాలి. ఎంప్యానల్‌ ఆసుపత్రులలో వసతులను కూడా పరిశీలించాలి. 

అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాక్‌ డ్రిల్‌ 
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్‌ జనరేషన్‌  ప్లాంట్స్‌పై మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలి. క్షుణ్నంగా అన్నీ తనిఖీ చేయాలి. టెండర్లు పూర్తయిన మెడికల్‌ కాలేజీలకు వెంటనే అగ్రిమెంట్‌లు పూర్తి చేయాలి. 

అనారోగ్య సమస్యలపై కాల్‌ 104  
ప్రజలకు ఏ అనారోగ్య సమస్య తలెత్తినా 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలి. క్వారంటైన్‌ సెంటర్స్, కోవిడ్‌ కేర్‌ సెంటర్స్, కోవిడ్‌ కాల్‌ సెంటర్లను పరిశీలించండి. జిల్లా స్ధాయిలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.

రికవరీ రేట్‌ 99.20 శాతం
► ఏపీలో రికవరీ రేట్‌ 99.20 శాతం కాగా పాజిటివిటీ రేట్‌ 0.64 శాతం 
► నిత్యం సగటున 197 కేసులు నమోదు, యాక్టివ్‌ కేసులు 2,140 
► 104కి కాల్స్‌ తగ్గుదల 
► థర్డ్‌ వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధం  
► అందుబాటులో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్‌ సిలెండర్లు  
► 100 బెడ్స్‌కి పైగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు 82 
► వ్యాక్సినేషన్‌ ఒక డోస్‌ పొందిన వారు 87.43 శాతం 
► రెండు డోస్‌లు పొందిన వారు 62.19 శాతం 
► డిసెంబర్, జనవరి కల్లా రాష్ట్రంలో అందరికీ రెండు డోస్‌ల వ్యాక్సినేషన్‌

త్వరలో విజయవాడలోనే జీనోమ్‌ ల్యాబ్‌
కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మరింత మ్యుటేషన్లు జరుగుతున్నందువల్ల చాలా వేగంగా విస్తరిస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై వివిధ దేశాల్లో అధ్యయనం జరుగుతోందని, ఈ వేరియంట్‌ను గుర్తించేందుకు జీనోమిక్‌ సీక్వెన్స్‌ కోసం రోజూ 15 శాతం శాంపిళ్లను సీసీఎంబీకి పంపుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంగ్‌కాంగ్‌ నుంచి వస్తున్న వారిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 12 దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్రం సూచించినట్లు వివరించారు.

త్వరలోనే విజయవాడలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి  ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి  ఎం.రవిచంద్ర, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి.కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి ఏ.బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి జీఎస్‌.నవీన్‌ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు