సకాలంలో ప్రాజెక్టులు పూర్తవ్వాలి

17 Sep, 2020 03:12 IST|Sakshi

వరద జలాలను ఒడిసి పట్టి.. ప్రాజెక్టులను నింపాలి

చిత్రావతి, గండికోట రిజర్వాయర్లను నింపాలి

జల వనరుల శాఖ సమీక్షలో సీఎం జగన్‌ దిశానిర్దేశం

నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక ఆయకట్టుకు నీళ్లందించాలి

భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు

వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి

2021 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి కావాల్సిందే

గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి. చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో నీరు నిండితే వారికే ప్రయోజనం కలుగుతుందని రైతులకు వివరించాలి. వరుసగా రెండో ఏడాది సోమశిల నిండింది. గేట్లు ఎత్తడంతో కండలేరుకు జలాలు చేరుతున్నాయి.     

శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కుల నీటిని మనం తీసుకెళ్లొచ్చు. నీటి మట్టం 854 అడుగులు ఉంటే కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకెళ్లాలి. అదృష్టవశాత్తు ఇప్పుడు 881 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. ఇది ఎక్కువ రోజులు ఉండదు. అందుకే వరద జలాలను ఒడిసి పట్టి చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలి. ఆ మేరకు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.  

భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఆ వరద నీటిని ఒడిసి పట్టి, ప్రాజెక్టులను నింపాలి. నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు ప్రయోజనం చేకూర్చాలి. పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్‌ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందే. 
–సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టు స్టేజ్‌–2 ఫేజ్‌–2 పనులను పూర్తి చేయాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో అధికారులు వెల్లడించిన వివరాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి. వేగంగా సాగుతున్న పనులు
► ‘ఈ ఏడాది నవంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు, వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలనుకున్న అవుకు సొరంగం–2 పనులు వేగంగా సాగుతున్నాయి. సీపేజీ వల్ల సొరంగంలో మట్టి చేరింది’ అని అధికారులు వివరించారు. నిపుణుల కమిటీ సలహా ప్రకారం పనులు పూర్తి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.  
► వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులు పూర్తయ్యాయి. మొదటి సొరంగంలో 413 మీటర్ల మేర పనులు మిగిలాయి. వర్షాల వల్ల నల్లమల అడవుల్లో పనుల్లో జాప్యం జరుగుతోంది. మొదటి సొరంగం పనులు నవంబర్‌ నాటికి, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు.  
క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ పై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌  

వడివడిగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు 
► వంశధార–నాగావళి అనుసంధానం పనులు డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయి. మొత్తం 33.5 కి.మీల హైలెవల్‌ కెనాల్‌కుగాను 25 కి.మీల పనులు పూర్తయ్యాయి. వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2 పనులను మార్చి నాటికి పూర్తి చేస్తాం. వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్‌ రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి.. ఒడిశా సీఎంతో సమావేశం కోసం లేఖ రాశాం. సమాధానం రావాల్సి ఉంది. 
► శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పూర్తయితే నందిగం, మెలియపుట్టి, పలాస, టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని, 24,600 ఎకరాలకు నీరందుతుందని సీఎం జగన్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.850 కోట్లు కాగా, ఇప్పటికే దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేశామని.. దీన్ని కూడా ప్రాధాన్యత కింద పూర్తి చేస్తామన్నారు.  
► తారకరామ తీర్థసాగరం రిజర్వాయర్‌ ప్రాజెక్టును 2022 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివరించారు.  
► తోటపల్లి ప్రాజెక్టులో భాగమైన గజపతినగరం బ్రాంచ్‌ కాల్వ పనులు 43 శాతం పూర్తి కాగా, మిగిలిన పనులు, భూసేకరణ కోసం రూ.139 కోట్లు వ్యయం చేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తయితే కొత్తగా 55 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు.

షెడ్యూల్‌ ప్రకారం పోలవరం 
► షెడ్యూల్‌ ప్రకారం పోలవరం పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. పోలవరానికి రీయింబర్స్‌మెంట్‌ రూపంలో రావాల్సిన రూ.3,805 కోట్ల విడుదలకు సంబంధించిన అంశంపై కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో చర్చించడానికి సోమవారం ఢిల్లీ వెళ్లాలని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌లను ఆదేశించారు.  
► ‘పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, కాలువల పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే లక్ష్యం. ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులు ఇప్పటికే పూర్తి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి మొత్తం 48 గేట్లు్ల బిగిస్తాం. కోవిడ్‌ వల్ల స్పిల్‌ వే కాంక్రీట్‌ పనుల్లో కాస్త జాప్యం జరిగింది’ అని అధికారులు వివరించారు. 

అవసరమైన ఉద్యోగుల సర్దుబాటు
► జల వనరుల శాఖలో అవసరాలను బట్టి అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని.. డ్యామ్‌లు, కాలువలు, వాటర్‌ రెగ్యులేషన్‌కు అవసరమైన లష్కర్‌లను, అవసరమైన చోట మెకానికల్, ఎలక్ట్రికల్‌ సిబ్బందిని ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా నియమించుకోవాలని సీఎం ఆదేశించారు.  
► సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు