చిట్టితల్లికి ఆరోగ్య భరోసా.. చెల్లెమ్మ కళ్లలో ఆనందం

16 Sep, 2023 19:49 IST|Sakshi

సాక్షి,  రాజమహేంద్రవరం: చెప్పాడంటే.. చేస్తాడంతే. మాటిచ్చాడంటే నెరవేరుస్తాడంతే. అది సంక్షేమ పాలనలో అయినా.. కష్టంలో ఉ‍న్నవాళ్లకి అందించే భరోసా విషయంలోనైనా. ఎనిమిది నెలల కిందట తన బిడ్డతో సాయం కోసం వచ్చిన ఓ చెల్లెమ్మ ముఖంలో ఇప్పుడు చిరునవ్వు పూయించారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆమెకు మానసికంగా ధైర్యం.. చిన్నారికి క్రమం తప్పకుండా చికిత్స అందుతుండడంలో సీఎం వైఎస్ జగన్ ఉదారత ఉంది. 

శనివారం నిడదవోలు పర్యటన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ని చిన్నారి శాంతి కుటుంబం కలిసింది. ఈ సందర్భంగా పాప ఆరోగ్యం కోసం వాకబు చేశారాయన.  గత 8 నెలల(సీఎం జగన్‌ భరోసా ఇచ్చినప్పటి నుంచి) సమయంలో పాప డయానా శాంతికి అందిన వైద్యం వివరాలన్నింటి గురించి కలెక్టర్ మాధవీలత వివరించారు. 

వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాయని,  ప్రాథమిక పరీక్ష,  రక్త నమూనా కోసం శాంతిని ఆరుసార్లు ఢిల్లీకి పంపామని,  జెనెటిక్స్ పరీక్ష కోసం రక్త నమూనాలను నొవార్టిస్ కంపెనీ సింగపూర్, అమెరికాకు పంపినట్లు కలెక్టర్‌ వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలన్నింటిలో సానుకూల ఫలితాలు రావడంతో.. మూడు వారాల్లో పాప కోసం ఇంజెక్షన్‌(రూ 16 కోట్ల ఖరీదు చేసేది) వచ్చే అవకాశం ఉందని ఆమె వివరించారు. 

డయానా శాంతి ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్-2’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ ఏడాది జనవరి 3వ తేదీన జిల్లా పర్యటన సంద్భంగా శాంతి తల్లి సూర్యకుమారి, సీఎం జగన్‌ను కలిసి తన గోడును వెల్లబోసుకుంది. ఆ సమయంలో తక్షణ  ఆర్థిక సహాయం గా  రూ.  లక్ష అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అంతేకాదు..  ప్రతి నెలా రూ.5 వేల వైఎస్ఆర్ నవశకం ఆరోగ్య పింఛను సైతం అందేలా చూడాలని అధికారులకు చెప్పారు. అదే సమయంలో.. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న ఆ కుటుంబానికి ఆసరా అందించేందుకు సూర్య కుమారికి నిడదవోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు.

చదవండి: కాపు నేస్తంతో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు