మనం నివసించేలా పేదల ఇళ్లు : సీఎం జగన్‌

17 Jun, 2021 18:11 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌తో పేదల ఇళ్ల నిర్మాణాల కోసం ప్రత్యేకంగా నియమించిన గృహ నిర్మాణ జేసీలు

పేదల ఇళ్ల నిర్మాణాల్లో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదు. ప్రతి పనిలో పారదర్శకతను, నాణ్యతను దృష్టిలో ఉంచుకోండి. నాణ్యత విషయంలో రాజీ పడితే, ఇబ్బందులు వస్తాయి. ఈ కాలనీల్లో వాణిజ్య కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టాలి. సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకుసాగాలి. అప్పుడే మంచి ఫలితాలు సాధించగలుగుతాం. పనిలో డూప్లికేషన్‌ ఉండకూడదు. – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: మనం ఆ ఇళ్లలో ఉండాలనుకుంటే ఎలా ఉండాలనుకుంటామో అలా ఆలోచించి, పేదల ఇళ్ల నిర్మాణాలను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఇళ్ల స్థలాలు, నిర్మాణం, మౌలిక సదుపాయాల రూపేణ సుమారు రూ.86 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఒక్క మౌలిక సదుపాయాలకే సుమారు రూ.34 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు 13 జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జాయింట్‌ కలెక్టర్లతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పేదల ఇళ్ల నిర్మాణాల్లో తీసుకోవాల్సిన చర్యలపై వారికి మార్గ నిర్దేశం చేశారు. మీరంతా యువత, మంచి ప్రతిభ ఉన్న వారని.. ప్రతిష్టాత్మకమైన ఈ పథకం కింద పేదలకు మేలు జరిగేలా వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

‘మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో గతంలో ఎప్పుడూ ఇళ్లు కట్టలేదు. దేశం మొత్తం ఇప్పుడు మనవైపు చూస్తోంది. 28.30 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నాం.17 వేలకు పైగా లే అవుట్లలో ఈ ఇళ్లను నిర్మిస్తున్నాం. కొన్ని లే అవుట్లు.. మునిసిపాల్టీల సైజులో ఉన్నాయి. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేదు. అధికారులంతా ఈ పథకం అమలు కోసం విశేషంగా పని చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల సహకారంతో సామాజిక తనిఖీ చేసి, అర్హులైన వారందరికీ శాచ్యురేషన్‌ పద్ధతిలో స్థలాలు ఇవ్వగలుగుతున్నాం. పెన్షన్లు, ఇంటి పట్టాలు, రేషన్‌కార్డులు, ఆరోగ్య శ్రీ.. రెగ్యులర్‌గా సామాన్య జనంతో లింకైన అంశాలు. అందువల్ల అర్హులైన పేదలందరికీ ఇవి అందేలా మనం చొరవ చూపాలి’ అని అన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

నిర్ణీత సమయంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి

  • అర్హులైన వారికి కచ్చితంగా అనుకున్న సమయంలోగా పట్టా ఇవ్వాలి. అవినీతి, పక్షపాతం లేకుండా, వివక్షకు తావులేకుండా ఇంటి పట్టాలు అందాలి. అర్హులు 100 మంది ఉంటే.. 10 మందికి ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు. నిర్ణీత సమయంలోగా వీటికి సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించి ప్రయోజనం కల్పించాలి. 
  • ఎవరైనా మిగిలిపోతే.. వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు అందాలి. వారి పేరు మీద కనీసం ఇంటి స్థలం రిజిస్టర్‌ చేసినట్లవుతుంది. ఇలా ఇళ్లపట్టాలు అందుకున్న వారికి ప్రతి ఏటా ఇళ్లు కూడా ఇవ్వాలి. ఇంటి స్ధలం, ఇళ్లు నిర్మించి ఇవ్వడం ద్వారా కనీసం రూ.5 లక్షల రూపాయల ఆస్తి వాళ్ల చేతుల్లో పెడుతున్నాం. అది కూడా మహిళల పేరుమీద ఇస్తున్నాం.
  • లబ్ధిదారులకు ఇప్పటికే స్థలం కేటాయింపు పూర్తైంది. నిర్ణీత సమయంలోగా ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. 15.60 లక్షల ఇళ్ల నిర్మాణంతో ఇది ఆగే ప్రక్రియ కాదు. మిగిలిన 12.70 లక్షల ఇళ్లు కూడా పూర్తి కావాలి.

మురికి వాడలుగా మారకూడదు 

  • ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మురికి వాడలుగా మారకూడదు. అక్కడ మంచి మౌలిక సదుపాయాలను కల్పించాలి. వివిధ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఈ మౌలిక సదుపాయాలను కల్పించాలి.  
  • ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ జైన్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి ముత్యాలరాజు, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా  హాజరయ్యారు.

చదవండి: విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు ఖాయం
ఏపీకి మరో 9 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు రాక

మరిన్ని వార్తలు