కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో ముగిసిన సీఎం జగన్ భేటీ

11 Jun, 2021 14:31 IST|Sakshi

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరిన సీఎం వైఎస్‌ జగన్‌

కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై చర్చ

సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సూచించిన ప్రత్యామ్నాయాలను సీఎం మరోసారి వివరించారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు.

వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలో రాష్ట్రంపై భారం లేకుండా చూడాలన్నారు. ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి తెలిపారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చేవారం ఏపీ సీఎస్‌, పెట్రోలియం కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎంకు కేంద్ర మంత్రి చెప్పారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని, దాదాపు 20 వేల మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారని కేంద్రమంత్రికి సీఎం  తెలిపారు. ఉద్యమంలో 32 మంది ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కు వచ్చిందన్నారు. 2002-15 మధ్య స్టీల్‌ప్లాంట్‌ మంచి పనితీరు కనబరిచిందని కేంద్రమంత్రికి సీఎం జగన్‌ తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ఆధ్వర్యంలో 19,700 ఎకరాల భూమి ఉందని, స్టీల్‌ప్లాంట్‌కు ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉందని వివరించారు. గడ్డు పరిస్థితుల దృష్ట్యా 2014-15 నుంచి స్టీల్‌ప్లాంట్‌కు కష్టాలు వచ్చాయని తెలిపారు.

సొంతంగా గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయాలను సీఎం సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రుణాలను ఈక్విటీగా మార్చాలన్నారు. మార్కెట్ ధరకు కొనుగోలు చేయడం వల్ల రూ.3,472 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఒడిశాలో ఉన్న ఇనుప ఖనిజం గనులను విశాఖ ప్లాంట్‌కు కేటాయించాలని సీఎం కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునే విషయంలో కేంద్ర శాఖలతో కలిసి పనిచేస్తామని సీఎం అన్నారు. సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో 7 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను స్టీల్‌ప్లాంట్‌ అందించిందని.. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిందని కేంద్రమంత్రికి సీఎం వైఎస్‌ జగన్ వివరించారు. సుమారు గంట పాటు భేటీ కొనసాగింది.  సీఎం వైఎస్‌ జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ ఉన్నారు.

చదవండి: YS Jagan: రాష్ట్రాభివృద్ధి సాకారానికి.. కావాలి.. మీ సహకారం 
పోలవరం ప్రాజెక్ట్‌లో నేడు తొలి ఫలితానికి అంకురార్పణ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు