కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం జగన్ భేటీ

11 Jun, 2021 11:07 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్ర సివిల్ సప్లైకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను కోరారు.  2020-21 రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్న సీఎం జగన్‌.. సకాలంలో రైతులకు పేమెంట్లు అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతుందని, బకాయిలు విడుదల అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సబ్సిడీ బకాయిలు చెల్లించాలని, కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలు విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. 

ఇదిలా ఉంచితే, కోవిడ్‌ వల్ల రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. 2015 డిసెంబర్ వరకు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఏపీలో 1.29 కోట్ల రేషన్‌కార్డుదారులకు ప్రతినెల బియ్యం కేటాయిస్తున్నారని, 2015 డిసెంబర్ తర్వాత 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో 60.96% కుటుంబాలకు, పట్టణాల్లో 41.14% కుటుంబాలకు మాత్రమే పరిమితం చేసి బియ్యం ఇచ్చేలా సూత్రాన్ని అమలు చేస్తున్నారని పీయూష్‌ గోయల్‌కు తెలిపారు. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని సీఎం జగన్‌ తెలిపారు. 

ముందుగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం కోరారు. సుమారు గంట పాటు భేటీ కొనసాగింది.  సీఎం వైఎస్‌ జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ ఉన్నారు.

చదవండి: YS Jagan: రాష్ట్రాభివృద్ధి సాకారానికి.. కావాలి.. మీ సహకారం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు