పారిశుద్ధ్య కార్మికురాలికి తొలి టీకా

17 Jan, 2021 03:11 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పారిశుద్ధ్య కార్మికురాలు పుష్పకుమారికి తొలి టీకాను ఇస్తున్న డాక్టర్‌

ఏపీలో వ్యాక్సినేషన్‌ షురూ..  

రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో ప్రారంభం 

విజయవాడలో కార్యక్రమాన్ని పరిశీలించిన సీఎం జగన్‌ 

తొలి దశలో 3.87 లక్షల మంది ఫ్రంట్‌ లైన్‌ సిబ్బందికి టీకా 

ప్రజల్లో అవగాహనకు పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించిన సీఎం

సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో లాంఛనంగా ప్రారంభించారు. సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ టీకా ప్రక్రియను పరిశీలించారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌లు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముఖ్యమంత్రికి వివరించారు. మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు, విజ్ఞానవంతులు కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లను రూపొందించడం ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.  

పారిశుద్ధ్య కార్మికురాలికి తొలి టీకా
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తొలి టీకాను ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారికి జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ శర్మిష్ట ఇచ్చారు. అనంతరం ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డెల్లీ(ఎఫ్‌ఎన్‌ఓ) సీహెచ్‌ నాగజ్యోతికి, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌ పి జయకుమార్‌కు ఇవ్వగా, తర్వాత జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ యల్‌ ప్రణీత, డాక్టర్‌ బండ్లమూడి బసవేశ్వర్, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ పి శ్యామ్‌ప్రసాద్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ కె.వెంకటేష్‌లకు టీకాలు వేశారు. వారందరినీ 30 నిమిషాలపాటు ఏఇఎఫ్‌ఐ మేనేజ్‌మెంట్‌ రూమ్‌లో పరిశీలనలో ఉంచారు. 

కోవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, ఉన్నతాధికారులు 

కరోనా వారియర్స్‌కే తొలి ప్రాధాన్యత
► కోవిడ్‌ –19 వ్యాక్సినేషన్‌ మొదటి విడత కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 332 కేంద్రాల్లో శనివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3.87 లక్షల మంది ఫ్రంట్‌ లైన్‌ సిబ్బందికి (ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో పని చేసే ఆరోగ్య, శానిటరీ సిబ్బంది, అంగన్‌వాడీ ఉద్యోగులకు) తొలి దశలో వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 
► కరోనా సమయంలో ఎంతో కృషి చేసిన హెల్త్‌ వర్కర్స్‌కి టీకా వేయడంలో తొలి ప్రాధాన్యత ఇచ్చినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 332 కేంద్రాల ద్వారా ప్రతిరోజూ ఒక్కో కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్‌ వేస్తారన్నారు. 
► తొలుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె శివశంకర్, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
► కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

చాలా సంతోషంగా ఉంది
రాష్ట్రంలో తొలి టీకాను.. అదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వేయించుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉంది. వ్యాక్సిన్‌ వేయించుకునే విషయంలో ఎలాంటి అపోహలు నమ్మలేదు. ధైర్యంగా టీకా వేయించుకున్నా. ధైర్యంగా ఉండమని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. 
– బి.పుష్పకుమారి, ప్రభుత్వాసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలు, విజయవాడ

తొలిరోజే టీకా ఆనందంగా ఉంది
ఏమైనా అవుతుందేమోనని తొలుత కొంచెం భయం వేసింది. అయినా ధైర్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో టీకా వేయించుకున్నా.ప్రస్తుతం ఎలాంటి దుష్ఫలితాలు లేవు. అంతా బాగానే ఉంది. కరోనా సమయంలో ఎంతో మంది రోగులకు సేవలు అందించాం. అలాంటి నాకు తొలి రోజునే టీకా వేయడం ఆనందంగా ఉంది. 

కోవిడ్‌ వ్యాక్సిన్‌పై అవగాహనకు వాల్‌పోస్టర్లు, కరపత్రాలు
► కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వివిధ వాల్‌పోస్టర్లు, కరపత్రాలను శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.
► ఈ ప్రచార సామగ్రిలో కోవిడ్‌–19 టీకా సురక్షితమైనదే అంటూ 8 అంశాలతో ముద్రించిన వాల్‌పోస్టర్, సురక్షిత విధానాలపై రూపొందించిన రెండు వాల్‌పోస్టర్లు, కోవిడ్‌ టీకా వేసుకునేందుకు నిర్ధేశించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, విధివిధానాలతో రూపొందించిన పోస్టర్, కోవిడ్‌ వైరస్‌ సోకకుండా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ఐదు అంశాలతో రూపొందించిన కరపత్రాలు ఉన్నాయి. 
► కోవిడ్‌ 19 టీకా కార్యక్రమంలో వలంటీర్లు, సామాజిక కార్యకర్తలు అయిన ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల పాత్ర.. గ్రామాల్లో, పట్టణాల్లో ఇతరులను ప్రభావితం చేయగలిగిన వారు, మత పెద్దలు, నాయకుల పాత్రపై రూపొందించిన మార్గదర్శకాల కరపత్రాలు ఉన్నాయి. 
► టీకా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న 50 ఏళ్ల లోపు వయస్సు ప్రజలకు ముఖ్యమైన సమాచారాన్ని పొందుపరుస్తూ రూపొందించిన కరపత్రాలను కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు.   

మరిన్ని వార్తలు