2022 జూన్‌ నాటికి పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం

10 Jun, 2021 18:11 IST|Sakshi

కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో భేటీ సందర్భంగా సీఎం జగన్‌

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని ఆయనకు వివరించారు. పోలవరం ప్రాజెక్ట్‌ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయం..రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు. 

పోలవరం ప్రాజెక్ట్, పునరావాస పనులను.. 2022 జూన్‌ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. జాతీయ ప్రాజెక్ట్‌ల విషయంలో వాటర్‌ సప్లయ్‌ని...ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా చూడాలని, పోలవరం ప్రాజెక్ట్‌ కోసం రాష్ట్రప్రభుత్వ వనరుల నుంచి ఖర్చు చేస్తున్నామని.. జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్‌ చేయాలని కోరారు. రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్‌వైజ్‌ ఎలిజిబిలిటీకి పరిమితం చేయొద్దన్నారు. పునరావాస పనులకు కూడా రీయింబర్స్‌ చేయాలని, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ కార్యాలయాన్ని...హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. 

కాగా, రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఈ మధ్యాహ్నం కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌లతో భేటీ అయ్యారు. అనంతరం  నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌తో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా కొనసాగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్‌, పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర నిధులు, సహకారంపై రాజీవ్‌ కుమార్‌తో సీఎం జగన్‌ చర్చించారు. ఈ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. ఆ తర్వాత నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ను ముఖ్యమంత్రి​ కలవనున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకొని తిరిగి శుక్రవారం తాడేపల్లి చేరుకుంటారు.

>
మరిన్ని వార్తలు