సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు

20 Oct, 2020 16:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ : బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దివ్య తల్లిదండ్రులు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్‌ దేవినేని అవినాశ్‌లు దివ్య తల్లిదండ్రులైన  జోసెఫ్‌, కుసుమ, దివ్య సోదరుడు దినేష్‌లను స్వయంగా సీఎం జగన్‌ వద్దకు తీసుకొచ్చారు. సీఎంను కలిసిన దివ్య తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.కాగా సీఎం జగన్‌ దివ్య కుటుంబానికి రూ.10లక్షల ఆర్థికసాయం అందించాలని హోంమంత్రికి సూచించారు.

అనంతరం దివ్య తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసి మాకు న్యాయం చేయాలని కోరామన్నారు. తమ మాటలకు చలించిపోయిన సీఎం తప్పకుండా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఆడపిల్లల ఎదుగుదలకు సీఎం జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని.. తమ కూతురు లాంటి వారు ఎందరో ఆ పథకాలతో ఎంతో ఉన్నతికి వస్తారని అనుకున్నామని తెలిపారు. కానీ ఆ కిరాతకుడు మా కూతురుని పొట్టన పెట్టుకున్నాడని దివ్య కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.(చదవండి : బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది)

హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తూ.. సీఎం జగన్‌ చాలా బాగా స్పందించారు. దివ్య తేజస్విని విషయంలో చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి దివ్య కుటుంబసభ్యుల బాధను పూర్తిగా విన్నారని.. వెంటనే వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కూడా చెప్పారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని.. చట్ట ప్రకారం ఆ కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని సుచరిత వెల్లడించారు.

దివ్య తేజస్విని కుటుంబానికి తాము అండగా ఉంటామని సీఎం జగన్‌ పేర్కొన్నారని దేవినేని అవినాశ్‌ తెలిపారు. ఇలాంటి సంఘటనల్లో పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయని.. తమ పార్టీ, ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉంటుందని అవినాశ్‌ తెలిపారు.కాగా మూడు రోజుల క్రితం హోంమంత్రి సుచరిత దివ్యతేజస్విని తల్లిదండ్రులను పరామర్శించటానికి వెళ్లిన సందర్భంగా తమకు సీఎంను కలిసే అవకాశం కల్పించమని హోంమంత్రిని కోరిన సంగతి తెలిసిందే. (చదవండి : దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్‌)

>
మరిన్ని వార్తలు