అరకొర ఆలోచనలు వద్దు : సీఎం జగన్‌ 

27 Aug, 2020 20:33 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : అరకొర ఆలోచనలు చేయవద్దని, దార్శనికతతోనే సమూల పరిష్కారాలు దొరుకుతాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి రంగంలో విజన్‌ ఉండాలని, పెద్ద ఆలోచనలతోనే మార్పులు సాధ్యపడతాయన్నారు. ఆర్బీకేల ఏర్పాటు, స్కూళ్లలో నాడు-నేడు, ప్రజారోగ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు అలానే వచ్చాయని చెప్పారు. గురువారం పశు సంవర్థక శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ చేపలు, రొయ్యలు పండిస్తున్న రైతులకు కనీస గిట్టుబాటు ధరలు రావాలి. మంచి ధరలు వచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం వ్యూహాత్మక విధానాన్ని అనుసరించాలి. ప్రీ ప్రైమరీ ప్రాసెసింగ్‌ నుంచి సెకండరీ ప్రాసెసింగ్‌ వరకూ.. ప్రభుత్వం నుంచి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆక్వా ఉత్పత్తుల కోసం ప్రీ ప్రాసెసింగ్‌, కోల్డ్‌ స్టోరేజీల సదుపాయాలు కల్పించాలి. వాటిని జనతా బజార్లకు అనుసంధానం చేయాలి. దీని వల్ల ప్రైవేట్‌ వ్యక్తులు సిండికేట్ కాకుండా రైతులకు భరోసా ఇవ్వగలుగుతాం.  ( మీ సహకారంతో సాకారం )

సుమారు 3200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, దళారుల నుంచి పొగాకు రైతులను కాపాడగలిగాం. ఆక్వా ఉత్పత్తుల విషయంలోనూ ధరల స్థిరీకరణ అమలు చేసేలా ఆలోచనలు చేయాలి. వైఎస్సార్‌ చేయూత కింద పాడి పశువుల కొనుగోలులో అమూల్‌ సలహాలు తీసుకోవాలి. దాణా, సంరక్షణ, సాంకేతిక అంశాల్లో కూడా అమూల్‌ భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. గొర్రెలు, మేకల పెంపకంలో కూడా వాళ్లతో ఒప్పందం చేసుకోవాలి. పాదయాత్రలో నా కళ్లతో చూసిన పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తున్నా. దేవుడు, ప్రజలు ఆశీర్వదించి ఈ సీటులో కూర్చోబెట్టారు. అందరికీ మంచి చేయాలని తపిస్తున్నాం. అంకిత భావంతో ముందడుగులు వేస్తున్నామ’’న్నారు.

మరిన్ని వార్తలు