బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి: సీఎం జగన్‌

24 May, 2021 19:22 IST|Sakshi

సాక్షి, అమరావతి : బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంజక్షన్లు తెప్పించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వైట్‌ ఫంగస్, ఎల్లో ఫంగస్‌లపైనా సమాచారం వస్తోందని, వాటిపైనా పూర్తి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌, రాష్ట్రంలో ఆక్సిజన్‌ నిల్వలపై సోమవారం సమీక్ష నిర్వహించారు.  డిప్యూటీ సీఎం (వైద్య ఆరోగ్య శాఖ)  ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర,ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్,  104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజుతో పాటు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..

అప్రమత్తంగా ఉండండి:
యాస్‌ తుపాను నేపథ్యంలో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం లేకుండా  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. రోజు వారీగా కావాల్సిన ఆక్సిజన్‌ను సరఫరా చేయడంతో పాటు, నిల్వలపైనా దృష్టి పెట్టాలి. దీనిపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి. 15 వేల ఆక్సిజన్‌ కాన్‌సెన్‌ట్రేటర్స్‌ తెప్పిస్తున్నాం. కాబట్టి వాటి నిర్వహణపై దృష్టి పెట్టాలి. అవి సక్రమంగా పని చేసేలా తగిన వ్యవస్థ ఉండాలి.

ఆక్సిజన్‌ జనరేషన్‌:
50 బెడ్లు దాటిన ప్రతి ఆస్పత్రికీ కచ్చితంగా ఆక్సిజన్‌ సౌకర్యం ఉండాలి. యాభై బెడ్లు దాటిన ఆస్పత్రుల్లో ఆగస్టు చివరి కల్లా ఆక్సిజన్‌ జనరేషన్‌ ఏర్పాట్లు పూర్తి కావాలి. అలాగే ఆయా ఆస్పత్రుల్లో కాన్‌సన్‌ట్రేటర్లు కూడా ఉండాలి. సొంతంగా ఆక్సిజన్‌ ప్లాంట్లు పెట్టుకునే ప్రైవేటు ఆస్పత్రులకు 30 శాతం ఇన్సెంటివ్‌. వారు కూడా ఆగస్టు చివరి కల్లా ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి.

యాస్‌ తుపాన్‌:
యాస్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ఆస్పత్రుల నుంచి కోవిడ్‌ రోగుల తరలింపుపై తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడి నుంచి వారిని తరలించాలన్న దానిపై వెంటనే నిర్ణయం తీసుకుని, తుపాను ప్రభావం మొదలు కాక ముందే వారిని తరలించాలి.  తుపాను కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి.

ఆస్పత్రులు–నిర్వహణ:
కార్పొరేట్‌ ఆస్పత్రుల మాదిరిగానే ఈ బోధనాసుపత్రుల నిర్వహణ కూడా ఉండాలి. రోగులకు ఇచ్చే ఆహారం నుంచి పారిశుద్ధ్యం వరకూ అన్నీ కూడా నాణ్యంగా ఉండాలి. పదికాలాల పాటు రోగులకు మంచి సేవలు అందించేలా అన్ని బోధనాసుపత్రులు ఉండాలి. ఏ విధంగా ఈ ఆస్పత్రులను నిర్వహిస్తారన్న దానిపై ఓ ప్రణాళికను వివరించాలి. కోవిడ్‌ లాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు