విత్తు నుంచి విక్రయం వరకూ.. 

1 Jan, 2021 04:24 IST|Sakshi
ఆర్బీకేలు, వ్యవసాయ మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్, అమూల్‌ ప్రాజెక్టుపై సమీక్షలో సీఎం జగన్‌

ఇదే నినాదం ఆర్బీకే విధానం కావాలి

రూ.10,235 కోట్లతో మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ కేంద్రాలు 

2021 మార్చిలో ప్రారంభించి ఏడాదిలో పూర్తి చేసేలా ప్రణాళిక

రైతులు ఆర్డర్‌ చేయగానే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఎప్పటిలోగా ఇస్తామో చెప్పాలి 

ఆర్డర్‌ చేసినా, సమయానికి అందలేదనే మాట ఎక్కడా రాకూడదు 

గ్రామ స్థాయిలో బయో పెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్‌ తయారీ యూనిట్లను ప్రోత్సహించాలి 

ఆర్బీకేల భాగస్వామ్యంతో ప్రతి గ్రామంలో కనీసం 3 యూనిట్లు ఉండేలా చూడాలి 

మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ కేంద్రాల్లో గోడౌన్లు, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ ఫాం, కలెక్షన్‌ సెంటర్లు, కోల్డు రూంలు, కోల్డ్‌ స్టోరేజీలు, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు, అసైయింగ్‌ ఎక్విప్‌మెంట్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ ఇన్‌ఫ్రా, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, ఆక్వా ఇన్‌ఫ్రా, పశు సంవర్ధక ఇన్‌ఫ్రా, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు, జనతా బజార్లు, ఇ–మార్కెటింగ్‌ తదితర సదుపాయాలు ఉంటాయి. 

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) పరిధిలో రూ.10,235 కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సహా మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ కేంద్రాలు ఏర్పాటు చేసేలా అంచనాలు రూపొందించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి 2021 మార్చిలో పనులు ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. విత్తనం నుంచి విక్రయం వరకూ.. అనే నినాదం ఆర్బీకేల విధానం కావాలన్నారు. ఆర్బీకేలు, వ్యవసాయ మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్, అమూల్‌ ప్రాజెక్టుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన ఇన్‌పుట్స్‌ ఇవ్వడమే కాకుండా, సకాలంలో వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావడమన్నది చాలా ముఖ్యం అని చెప్పారు. రైతు ఆర్డర్‌ చేయగానే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర వాటిని ఎప్పటిలోగా అందిస్తామనే విషయాలను స్పష్టంగా చెప్పాలన్నారు. ఎప్పటిలోగా వాటిని ఇస్తామనే విషయాన్ని ఆర్బీకేల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. ఆర్డర్‌ చేసినా, సమయానికి అందలేదనే మాట ఎక్కడా రాకూడదని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని, అధికారులను నియమించుకోవాలని సూచించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..  
ఆర్బీకేలు, వ్యవసాయ మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట 
► ఆక్వా ఫీడ్, ఆక్వా సీడ్‌ నాణ్యతను నిర్ధారించేందుకు నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటు చేసే ల్యాబ్‌లను ఆర్బీకేలతో అనుసంధానం చేయాలి. సేంద్రియ, సహజ పద్ధతులకు పెద్దపీట వేసేలా సంబంధిత ఉత్పత్తులను వీటి పరిధిలోకి తీసుకురావాలి. వీటికి పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించాలి. 
► ఏలూరు ఘటనను దృష్టిలో ఉంచుకుని సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. ఆర్గానిక్‌ వ్యవసాయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ప్రోత్సాహం ఇవ్వాలి.  
► బయో పెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్‌ తయారు చేసే యూనిట్లను గ్రామాల స్థాయిలో ప్రోత్సహించాలి. ఆర్బీకేల భాగస్వామ్యంతో కనీసం ప్రతి గ్రామానికి 3 యూనిట్లు ఉండేలా చూడాలి. దీనివల్ల కల్తీ లేకుండా, నాణ్యమైన సేంద్రియ ఎరువులు అందుబాటులోకి వస్తాయి.   

మరింత సమర్థంగా ఆర్బీకేల పనితీరు 
► విత్తనం నుంచి పంట విక్రయం ప్రక్రియ మధ్య కార్యకలాపాల్లో రైతులకు చేదోడు, వాదోడుగా ఆర్బీకేలు నిలబడతాయి. ఈ దిశగా ఆర్బీకేల కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగేలా వ్యవసాయ వర్సిటీ కార్యాచరణ రూపొందించుకోవాలి. ఆర్బీకే కార్యకలాపాలను కేటగిరీలుగా విభజించాలి.  
► మార్కెటింగ్, పంటలకు ముందు.. పంటల తర్వాత, తదితర అంశాలపై అగ్రి వర్సిటీ పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. తర్వాత వారు అప్రెంటిస్‌లో భాగంగా వీటిపై పట్టు సాధించాలి. దీనివల్ల వారికి ఈ అంశాల్లో సమర్థత పెరుగుతుంది.  
► నిర్దిష్ట కాల వ్యవధిలో అన్ని రైతు బజార్ల ఆధునికీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. మార్కెట్‌ యార్డుల్లో నాడు– నేడుకు శ్రీకారం చుట్టాలి. దాదాపు రూ.212 కోట్లతో ఈ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించాలి. 
► రాష్ట్రంలో ఇప్పుడున్న 10,641 ఆర్బీకేలకు తోడు కొత్తగా 125 అర్బన్‌ ఆర్బీకేలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఆర్బీకే హబ్‌లలో వాహనాల సంఖ్య 65 నుంచి 154కు పెంచుతున్నామని, ప్రతి ఆర్బీకేలో కంప్యూటర్, ప్రింటర్, యూపీఎస్, బయోమెట్రిక్‌ డివైజ్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  
► మార్చి 31 నుంచి 147 నియోజకవర్గాల స్థాయి ల్యాబ్‌లు పని ప్రారంభిస్తాయని వెల్లడించారు. జూన్‌ 30 నాటికి 13 జిల్లా స్థాయి ఇంటిగ్రేటెడ్‌ అగ్రిల్యాబులు ఏర్పాటవుతాయని చెప్పారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు