కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న సీఎం జగన్‌‌

2 Apr, 2021 19:28 IST|Sakshi
గుంటూరులోని భారత్‌పేట 140వ వార్డు సచివాలయంలో వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో ఆయన సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి, మంత్రి ఆళ్ల నాని 

ఈ ప్రక్రియను ఒక యజ్ఞంలా కొనసాగించాలి 

గుంటూరులో వ్యాక్సిన్‌ వేయించుకున్న అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ 

ఆరు రోజుల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే గ్రామాల్లో సైతం వ్యాక్సినేషన్‌  

90 రోజుల్లో వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని భావిస్తున్నాం 

ఈ ప్రక్రియలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వార్డు, గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకుని కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మిగిలి ఉన్న ఆరు రోజుల ప్రక్రియ పూర్తి కాగానే గ్రామాల్లో సైతం వ్యాక్సినేషన్‌ ఉధృతం చేస్తామన్నారు. గురువారం ఆయన తన సతీమణితో కలిసి గుంటూరులోని భారత్‌పేట 140వ వార్డు సచివాలయంలో వ్యాక్సిన్‌ వేయించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బందితో మమేకమై వ్యాక్సినేషన్‌ ఆవస్యకతపై దిశా నిర్దేశం చేశారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఏ వార్డు, ఏ గ్రామంలో జరుగుతుందో ముందుగానే వాటి పరిధిలోని వలంటీర్లు, ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి సమాచారం ఇస్తారన్నారు.

డోర్‌ టు డోర్‌ సర్వే చేపట్టి, 45 సంవత్సరాల వయసు పైబడిన వారి ఆరోగ్య వివరాలు నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వేసే తేదీని ముందుగానే తెలియజేస్తారన్నారు. ఆ తేదీ నాటికి ఆ వార్డు, లేదా గ్రామంలో డాక్టర్ల బృందం (ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, డాక్టర్‌తో కూడిన 104 అంబులెన్స్, ఎమర్జెన్సీ సర్వీసుల కోసం 108 అంబులెన్స్, నర్సులు) అందుబాటులో ఉండాలి. వీరంతా గ్రామ సచివాలయంలో చెప్పిన తేదీన జాబితా ప్రకారం వ్యాక్సినేషన్‌ కార్యక్రామాన్ని కొనసాగిస్తారని తెలిపారు. చివరగా ఎవరైనా వ్యాక్సిన్‌ వేయించుకోకుండా మిగిలిపోతే వారి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించి, సచివాలయానికి తీసుకొచ్చి వ్యాక్సిన్‌ చేయిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టి సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు.. 
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 45 ఏళ్లు వయసు పైబడి ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయని సీఎం చెప్పారు. రాబోయే రోజుల్లో 45 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుత విధానంలో నాలుగు నుంచి ఆరు వారాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారని, కొద్దిగా ఎక్కువ సమయం పట్టినా మూడు నెలల్లోగా (90 రోజుల్లో) అందరికీ వ్యాక్సిన్‌ అందించగలమని తెలిపారు.
 
స్థానిక ఎన్నికలు పూర్తవగానే గ్రామాల్లో.. 
గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా డ్రైవ్‌ చేయాలంటే కొద్దిగా సమస్య వస్తోందని సీఎం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని, ఎస్‌ఈసీ ఎన్నికలు పెట్టాలని నిర్ణయం తీసుకున్న రోజు నుంచి ఆరు రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. ఎన్నికల్లో ఉద్యోగులు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు అందరూ భాగస్వామ్యులు అవుతున్నందున ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ రెండూ చేయడం కాస్త కష్టమవుతోందన్నారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి, చీఫ్‌ సెక్రటరీ, డీజీపీలు.. కొత్త ఎస్‌ఈసీకి రాష్ట్రంలో పరిస్థితి వివరించి చెప్పడంతో పాటు, కొత్త ఎస్‌ఈసీకి కూడా రాష్ట్ర పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండటంతో ఈ ఆరు రోజుల ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే గ్రామీణ ప్రాంతాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన 90 రోజుల్లో వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని చెప్పారు.

ఏకైక అస్త్రం వ్యాక్సినే..  
‘కోవిడ్‌ అనేదానిని మనం ఆపలేం. వస్తుంది.. వచ్చిపోతుంది. ఇప్పటికిప్పుడు ఎవరూ ఆపగలిగే పరిస్థితి లేదు. దీనితో సహజీవనం చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఈ పరిస్థితిలో వ్యాక్సిన్‌ ఒక్కటే మన ముందున్న దారి’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వేగంగా రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వగలిగితే ఆరోగ్య భద్రత మెరుగు అవుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఇంత ప్రాధాన్యంగా జరపలేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇప్పుడు వారి సాయంతో వ్యాక్సినేషన్‌ కూడా పూర్తి చేసి.. ఇలా కూడా చేయొచ్చు అని చాటి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని ఆకాంక్షించారు. అందరికీ మంచి జరగాలని మనసారా ఆశిస్తూ, దేవుడి దయ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్లనాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, శాసన మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీఎం కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, నందిగం సురేష్, నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర నాయుడు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు