నెరవేరనున్న నాలుగు దశాబ్దాల మెట్ట ప్రాంతీయుల కల 

23 Dec, 2022 10:52 IST|Sakshi

ప్రజలకు చేరువలో గాలేరు–నగరి సుజల స్రవంతి ఫలాలు  

డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ 

కమలాపురంలో మరో రూ.902 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన  

ఇదివరకే రూ.1,284 కోట్లతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు 

నేటి నుంచి జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ మూడురోజుల పర్యటన 

నేడు కమలాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు 

సాక్షి ప్రతినిధి, కడప: కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్నారు. అధికారిక పగ్గాలు అందుకోగానే  కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. జలయజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంకల్పించారు.

తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి పనులు చేసిన నాయకుడిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఫలాలు అందుతాయని ఆశించిన తరుణంలో ఆయన ఆకస్మిక మరణం అశనిపాతంలా మారింది. తండ్రి  స్వప్నం సాకారం చేసేందుకు తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగు వేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ఫలాలు ప్రజలకందించేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 

ప్రాజెక్టులకు జీవం పోసిన వైఎస్‌ఆర్‌
మెట్ట ప్రాంతమైన రాయలసీమకు జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాణప్రదం. టీడీపీ పాలకులకు ఆ విషయం తెలిసినా చరణలో విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆ పథకాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవం పోశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం విస్తరించి, శరవేగంగా రెండు పథకాల పనులను పరుగెత్తించారు. ఇది జగమెరిగిన సత్యం. మెట్ట ప్రాంతాల్లో నీరు పుష్కలంగా కన్పిస్తోందంటే అందుకు వైఎస్సార్‌ ఏకైక కారణమని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.  

నిండు కుండలా గండికోట ప్రాజెక్టు..  
జీఎన్‌ఎస్‌ఎస్‌ పథకంలో జిల్లాకు ఆయువు పట్టు ఎద్దుల ఈశ్వరరెడ్డి గండికోట ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిండు కుండలా దర్శనమిస్తోంది. తద్వారా అటు మైలవరం ప్రాజెక్టు, ఇటు పైడిపాలెం, వామికొండ, సర్వారాయసాగర్‌లలో సైతం పుష్కలంగా నీరు నిల్వ ఉంది. తద్వారా భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయి. కాగా డి్రస్టిబ్యూటరీ కెనాల్స్‌ పూర్తి అయితే ఆయకట్టుకు నీరు అందించే వెసులుబాటు కలగనుంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డి్రస్టిబ్యూటరీ కెనాల్స్‌కు శుక్రవారం కమలాపురంలో శంకుస్థాపన చేయనున్నారు. 2023 అక్టోబర్‌ నాటికి పనులు పూర్తి చేసి, ఆయకట్టుకు నీరు అందించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు.  

సర్వరాయసాగర్‌ పునరావాసానికి గ్రీన్‌సిగ్నల్‌..  
3.06 టీఎంసీలతో నిర్మించిన నర్రెడ్డి శివరామిరెడ్డి ప్రాజెక్టు (సర్వరాయసాగర్‌) దిగువనున్న రెండు గ్రామాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. వీరపునాయునిపల్లె మండలంలోని ఒంటిగారిపల్లె, ఇందుకూరు గ్రామాల్లో నీటి జౌకులు లభిస్తున్నాయి. జౌకులు కారణంగా వ్యవసాయానికి ప్రతిబంధకంగా మారింది. దీంతో ఈ రెండు గ్రామాలకు పునరావాసం సుస్థిర నివాసం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదించగా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

పాదయాత్ర హామీ అమలు... 
ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. అందులో వామికొండ, సర్వరాయసాగర్‌ ప్రాజెక్టు  పనులు పూర్తి చేస్తామని, ఇక్కడి రైతాంగానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమేరకు సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ పెండింగ్‌ పనుల పూర్తి కోసం రూ.212 కోట్లు నిధులు మంజూరు చేశారు. నేడు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.  

వైఎస్‌ కుటుంబానికి కమలాపురంపై ప్రత్యేక శ్రద్ధ
కమలాపురం ప్రజలన్నా, ఈ ప్రాంతమన్నా వైఎస్‌ కుటుంబానికి ప్రత్యేక శ్రద్ధ. నాడు వైఎస్సార్‌ కమలాపురం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని సంకలి్పంచగా, తండ్రి ఆశయాన్ని తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారు. 2019–22 మధ్య మూడేళ్ల కాలంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం సుమారు రూ.1284 కోట్లు వివిధ పనుల కోసం వెచ్చించారు. శుక్రవారం దాదాపు రూ.902 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నాం.     –ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి 

యుద్ధప్రాతిపదికన భూ సేకరణ
వామికొండ, సర్వరాయసాగర్‌ పరిధిలో డి్రస్టిబ్యూటరీ కెనాల్స్‌ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణను యుద్ధప్రాతిపదికన చేపడతాం. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే భూ సేకరణ చాలా వరకు పూర్తయింది. మిగిలిన భూ సేకరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.  త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. –వి.విజయరామరాజు, కలెక్టర్‌

అక్టోబరు నాటికి సాగునీరు 
వామికొండ, సర్వరాయసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో మిగులు పనులకు రూ. 212 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. డి్రస్టిబ్యూటరీ కెనాల్స్‌ పనులు పూర్తి చేసి వచ్చే అక్టోబరు నాటికి కనీసం 20 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించాం.                                
–మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఈ, జీఎన్‌ఎస్‌ఎస్, కడప

జిల్లాకు రానున్న సీఎం వైఎస్‌ జగన్‌ 
మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి కడపకు 11.30 గంటలకు చేరుకుంటారు. 11.50 గంటలకు రోడ్డు మార్గాన కడప పెద్ద దర్గాకు చేరుకోనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు, పీఠాధిపతితో సమావేశం అనంతరం 12.20 గంటలకు బయలుదేరి, 12.35 గంటలకు  ఏపీఐఐసీ సలహాదారు రాజోలి వీరారెడ్డి ఇంటికి వెళతారు. 12.45 గంటలకు బయలు దేరి ఏపీఎస్‌ఆరీ్టసీ చైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి నివాసానికి చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.

మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి 1.15 గంటలకు మాధవి కన్వెన్షన్‌ హాల్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌ కుమారుడి వివాహ వేడుకలకు హాజరు కానున్నారు. అనంతరం 1.45 గంటలకు ఎయిర్‌పోర్టు చేరుకొని హెలికాప్టర్‌లో 2.05 గంటలకు కమలాపురం చేరుకుంటారు. 2.15 గంటలకు బహిరంగ సభా ప్రాంగణం చేరుకొని 2.25 వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫకాలను ఆవిష్కరించనున్నారు. 2.30 గంటల నుంచి 3.45 గంటల వరకూ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 3.55 గంటలకు కమలాపురం హెలిప్యాడ్‌కు చేరుకొని 4.30 గంటల వరకూ స్థానిక నాయకులతో మాట్లాడతారు. 4.35 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకోనున్నారు. 5 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేయనున్నారు.    

మరిన్ని వార్తలు