CM Jagan: 25న నరసన్నపేటకు సీఎం వైఎస్‌ జగన్‌!

13 Nov, 2022 18:48 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఏదో ఒక చోట జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష (రీ సర్వే) రెండో విడత పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించి సీసీఎల్‌ఏ నుంచి కలెక్టర్‌ శ్రీ కేష్‌ బి.లాఠకర్‌కు ప్రాథమిక సమాచారం చేరింది.

ఇదే అంశంపై శనివారం సాయంత్రం నరసన్నపేట ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌తో కలెక్టర్‌ లాఠకర్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల విషయాన్ని ఈ సందర్భంగా చర్చించారు. తామరాపల్లిలో సభ నిర్వహణకు అనువుగా ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. సభ నిర్వహణ ఏర్పాట్లు, హెలీ పాడ్, తదితర అంశాలను సోమవారం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు.

డిసెంబర్‌ నెలాఖరులో భావనపాడు పోర్టుకు శంకుస్థాపన, ఉద్దానం మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి కూడా ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలను కూడా కలెక్టర్‌తో కలిసి చర్చించారు. ఈ భేటీలో డీసీసీబీ చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, రాజాపు అప్పన్న, ముద్దాడ బైరాగి నాయుడు, చింతు రామారావు, కణితి కృష్ణారావు, త్రినాథ్‌ తదితరులు ఉన్నారు. 

చదవండి: (పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్‌)

మరిన్ని వార్తలు