Narasapuram Tour: పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

21 Nov, 2022 17:55 IST|Sakshi

Time: 01:16 PM
టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు: సీఎం జగన్‌
టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జనసేనను రౌడీసేనగా మార్చేశారన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. చివరికి కుప్పంలో కూడా వైఎస్సార్‌సీపీనే గెలిపించారని సీఎం అన్నారు.

Time: 12:46 PM
నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం అన్నారు.

Time: 12:42 PM
నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి: సీఎం జగన్‌
దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం జగన్‌ అన్నారు. ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం పేర్కొన్నారు.

Time: 12:34 PM
గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదు: మంత్రి అప్పలరాజు
మత్స్యకారులకు సీఎం జగన్‌ అండగా నిలిచారని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని మంత్రి అన్నారు.

Time: 12:25 PM
దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం: ప్రసాదరాజు
మత్స్యకారులకు అండగా నిలిచిన సీఎం జగన్‌కు ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్‌ రాకతో నర్సాపురం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ప్రసాదరాజు అన్నారు.

Time: 12:13 PM
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా యూనివర్శిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్ట్‌, ఉప్పు టేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్‌ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించారు.

Time: 12:05 PM
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

Time: 11:59 AM
మత్స్యకార కుటుంబాలకు పరిహారం ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ అన్నారు. 23 వేల మంది మత్స్యకారులకు రూ. 107 కోట్ల పరిహారం అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను ఓటు బ్యాంకుగానే వాడుకుందన్నారు.

Time: 11:05 AM
సీఎం వైఎస్‌ జగన్‌ నరసాపురం చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కాసేపట్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Time: 10:35 AM
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బయల్దేరారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా విశ్వవిద్యాలయానికి, బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌కు, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఇవీ ప్రారంభోత్సవాలు
నరసాపురం పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్‌ అయింది. అందువల్ల చుట్టుపక్కల గ్రామాలలో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇప్పుడు అదే ఆస్పత్రిలో నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. రూ.13 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు.

నరసాపురం పట్టణంలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు. ఈ పథకం వల్ల రాబోయే 30 ఏళ్ల వరకు నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎటువంటి సమస్యా ఉండదు. 

ఇంకా శంకుస్థాపనలు ఇలా..
రూ.4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్‌స్టేషన్‌ పునరుద్ధరణ పనులు.
రూ.1.08 కోట్ల అంచనాతో నరసాపురం డివిజినల్‌ ఉప ఖజానా కార్యాలయం కొత్త భవన నిర్మాణం.
రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు.
నరసాపురం పురపాలక సంఘం పరిధిలో రూ.237 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి నిర్మాణం. రూ.87 కోట్లతో మొదటి ఫేజ్‌ పనులు.
రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం. 
రూ.7.83 కోట్ల అంచనా వ్యయంతో చివరి గ్రామాలకు సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్‌ డీ సిల్టింగ్, టెయిల్‌ డ్యామ్‌ నిర్మాణం, సీసీ లైనింగ్‌ పనులు.
రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్‌ పంట కాలువ నిర్మాణం. 
రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్‌ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్‌ఫాల్‌ నాలుగు స్లూయీస్‌ల పునః నిర్మాణం.

సీఎం జగన్‌ పర్యటన ఇలా
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకుంటారు. 11.15 – 12.50 మధ్య వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లికి యలుదేరుతారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

 

మరిన్ని వార్తలు