Tokyo Olympics: సింధుకు ఏపీ ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం

3 Aug, 2021 03:44 IST|Sakshi

ఒలింపిక్స్‌ సహా అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకూ ప్రోత్సాహకాలు  

అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం    

సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన రాష్ట్రానికి చెందిన పీవీ సింధుకు నగదు ప్రోత్సాహకం అందించాలని అధికారులను  సీఎం జగన్‌ సోమవారం ఆదేశించారు. సింధుతోపాటు వివిధ అంతర్జాతీయ, జాతీయ క్రీడా వేదికలపై పతకాలు సాధించిన రాష్ట్రంలోని ఇతర క్రీడాకారులకు కూడా నగదు ప్రోత్సాహకాలు అందించాలని సీఎం ఆదేశాలిచ్చారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందని సీఎం జగన్‌ కొనియాడారు. సింధు విజయాలు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.

ప్రతిభ చాటుతున్న రాష్ట్ర క్రీడాకారులందరినీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి జాతీయ సీనియర్, సబ్‌ జూనియర్‌ స్థాయిల్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహిస్తూ నగదు ఇచ్చామని గుర్తు చేశారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటిన రాష్ట్ర క్రీడాకారులు ఇంకా ఎవరైనా మిగిలిపోతే స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం నగదు ఇవ్వాలని సీఎం తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విశాఖపట్నంలో 2 ఎకరాల స్థలాన్ని అకాడమీ నిర్వహణ కోసం కేటాయించింది. టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లేముందు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనిలకు రూ.5 లక్షల చొప్పున నగదు సహాయం కూడా చేశారు. 2017–22 స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.75 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.30 లక్షలను నగదు ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు