ఏకాంతంగా దేవదేవుడి గరుడోత్సవం

24 Sep, 2020 03:15 IST|Sakshi
తిరుమల ఆలయం వద్ద అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పంచెకట్టు, తిరునామం, తలపాగాతో సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రవేశం

హుండీలో కానుకల చెల్లింపు..తీర్థ, ప్రసాదాల స్వీకరణ 

2021 డైరీలు, క్యాలెండర్ల ఆవిష్కరణ

సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు బుధవారం రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్ప స్వామి తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. పంచెకట్టు, తిరునామంతో సంప్రదాయబద్ధంగా అందజేశారు. 
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

► న్యూఢిల్లీ నుంచి నేరుగా సాయంత్రం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం.. రోడ్డు మార్గాన తిరుమల పద్మావతి అతిథి గృహం చేరుకున్నారు. అక్కడ టీటీడీ చైర్మన్, అధికారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకు స్వాగతం పలికారు.
► అనంతరం అన్నమయ్య భవన్‌ చేరుకుని ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అక్కడి నుంచి బేడి ఆంజనేయస్వామి ఆలయం చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు పరివట్టంతో తలపాగా చుట్టి పట్టువస్త్రాల పళ్లెంను సీఎం తలపై పెట్టారు.
► వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ 6.23 గంటలకు ఆలయం లోపలికి చేరుకుని, అర్చకులకు పట్టు వస్త్రాలు అందజేసి, శ్రీవారిని దర్శించుకున్నారు. 
► అనంతరం వకుళామాత దేవిని, ఆలయ ప్రదక్షిణగా విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభానికి నమస్కరించారు. హుండీలో కానుకలు చెల్లించి, రంగనాయక మండపం చేరుకున్నారు. 
టీటీడీ 2021 డైరీని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు 

► వేద ఆశీర్వచనం అనంతరం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి స్వామివారి చిత్రపటంతోపాటు, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కల్యాణ మండపం వద్ద ఏకాంతంగా సాగిన గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. కాగా, సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఇది రెండోసారి. 
► టీటీడీ ముద్రించిన 2021 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను సీఎం జగన్‌ ఆలయంలో ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 75 వేలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది. ఇవి సెప్టెంబర్‌ 28వ తేదీ నుంచి తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉంటాయి. అక్టోబర్‌ రెండో వారం నుంచి ఇతర ప్రాంతాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.  
► సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం రాత్రి తిరుమలలోనే బసచేస్తారు. గురువారం ఉదయం మరోమారు శ్రీవారిని దర్శించుకుంటారు. నాద నీరాజనం వేదికపై నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర చారిటీస్‌ సత్రాల శంకుస్థాపనలో పాల్గొంటారు. 

మరిన్ని వార్తలు