పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువు: సీఎం జగన్

19 Apr, 2021 11:51 IST|Sakshi

చదువుతోనే మన రూపురేఖలు మారుతాయి

విద్యా దీవెన ద్వారా 10.88లక్షల మంది పిల్లలకు లబ్ధి

పిల్లల ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా ఉంది

‘విద్యాదీవెన’ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

ఆన్‌లైన్ ద్వారా తల్లుల ఖాతాల్లో ‘జగనన్న విద్యాదీవెన’ నగదు జమ చేసిన సీఎం

సాక్షి, అమరావతి: పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏప్రిల్‌లో విద్యాదీవెన మొదటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని.. 14న అంబేడ్కర్‌ జయంతి ఘనంగా జరుపుకున్నామన్నారు. ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ,  విద్యా దీవెన ద్వారా 10.88లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ‘‘2018-19లో బకాయిలు ఉన్న రూ.1800 కోట్లను మన ప్రభుత్వమే చెల్లించింది. 2019-20 ఏడాదికి పూర్తి రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు లేకుండా చేశాం. ఏ ఏడాది ఫీజు రియింబర్స్‌మెంట్‌ను అదే ఏడాదిలో చెల్లిస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తున్నాం. ప్రతి త్రైమాసికంలో నేరుగా తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తాం. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీలుగా మార్చాం. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చుతున్నాం. పిల్లల ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా ఉంది. పిల్లల తల్లులకు ప్రభుత్వం తరఫున లేఖలు కూడా రాశాం. వసతి దీవెన కూడా ఎప్పుడు ఇస్తామన్నది లేఖలో రాశామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఇందుకోసం ఆర్థిక శాఖతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు రూ.671.45 కోట్లను విడుదల చేస్తూ ఆదివారం జీవోలు జారీ చేశాయి. బీసీ సంక్షేమ శాఖ రూ.491.42 కోట్లను జగనన్న విద్యాదీవెన మొదటి విడత కోసం విడుదల చేసింది. ఇందులో బీసీ విద్యార్థులతో పాటు ఈబీసీ, కాపు విద్యార్థులు ఉన్నారు. ఎస్సీ విద్యార్థుల కోసం ఎస్సీ సంక్షేమ శాఖ రూ. 119.25 కోట్లు, ఎస్టీ విద్యార్థుల కోసం ఎస్టీ సంక్షేమ శాఖ రూ.19.10 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ రూ.41.68 కోట్లు విడుదల చేసింది.
చదవండి:
టీడీపీలో సస్పెన్షన్ల కలకలం..
వీర్రాజు, అచ్చెన్నలకు పదవీ గండం?

మరిన్ని వార్తలు