పూర్తి సహకారం అందిస్తాం.. కేంద్రమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు: సీఎం జగన్‌

26 Aug, 2022 15:41 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో 47వ జాతీయ కార్మిక సదస్సు రెండు రోజులపాటు అట్టహాసంగా జరిగింది. 19 రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు విచ్చేయగా.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్‌ జాతీయ కార్మిక సదస్సు ముగింపు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

'ఈ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. తిరుపతిలో జరుగుతున్న ఈ సదస్సుకి ముఖ్యులంతా రావడం సంతోషకరం. ఒక జాతీయ సదస్సుకి తిరుపతిని వేదికగా చేసిన కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఈ సదస్సుకి వచ్చిన అందరికీ తిరుమల బాలాజీ దీవెనలు ఉంటాయని భావిస్తున్నాను. గడిచిన రెండు రోజులుగా ఈ సదస్సులో చర్చించిన అంశాలు కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను.

పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతంలో ఈ సదస్సు ద్వారా చేసిన మేధోమధనం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఏపీలో ఈ సదస్సు జరగడం ఆనందదాయకం, అంతేకాక ఇది గౌరవంగా భావిస్తున్నాం. అందరికీ బెస్ట్‌ విషెష్‌ చెబుతూ' సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

చదవండి: (భారతదేశం శ్రామికుడి శక్తి : ప్రధాని) 

మరిన్ని వార్తలు