అంబేడ్కర్‌ భావాలు అజరామరం

15 Apr, 2022 03:32 IST|Sakshi
అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రులు, నేతలు

భారత సమాజాన్ని నడిపిస్తున్న మహాశక్తి బాబా సాహెబ్‌

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు సీఎం జగన్‌ ఘన నివాళులు  

సాక్షి, అమరావతి: భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని, ఆయన భావాలకు మరణం లేదని సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా గురువారం తాడేపల్లిలోని తన నివాసంలో బాబాసాహెబ్‌ చిత్రపటానికి సీఎం జగన్‌ ఘనంగా నివాళులర్పించారు. అలాగే రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పిస్తూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్‌. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన.

ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్లకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పాల్గొన్నారు. 

జీసస్‌ మహాత్యాగానికి గుర్తు ‘గుడ్‌ ఫ్రైడే’
‘కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్‌ ఫ్రైడే రోజు, ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్‌ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ముఖ్య ఘట్టాలు’ అని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. గుడ్‌ ఫ్రైడే సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జీసస్‌ మహా త్యాగానికి గుర్తు గుడ్‌ ఫ్రైడే అని పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ ఏసు ప్రభువు తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన సందేశాలని సీఎం తెలిపారు. 

మరిన్ని వార్తలు