అన్ని సర్వేల్లో అత్యున్నత గ్రాఫ్‌.. కోటంరెడ్డి పనితీరుపై సీఎం జగన్‌ ప్రశంసల వర్షం

8 Jun, 2022 13:36 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

నెల్లూరు(సెంట్రల్‌): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురి కావడం, నెల్లూరు అపోలో వైద్యశాల నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించడం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకున్న శ్రీధర్‌రెడ్డి నెల్లూరుకు చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మంగళవారం ఫోన్‌ చేసి కోటంరెడ్డితో పలు విషయాలు చర్చించారు. అసలేమి జరిగింది, వైద్యులు ఏమి చెప్పారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నా.. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోటంరెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. రూరల్‌ నియోజకవర్గంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం విషయాలపై చర్చించారు.

చదవండి: (మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతు తీసుకోవడమే: సీఎం జగన్‌)

మొదటి విడత ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పూర్తి చేశామని, త్వరలోనే  రెండో విడత ప్రారంభిస్తానని ముఖ్యమంత్రికి కోటంరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,  క్షేత్ర స్థాయిలో వాటి ఫలితాలు అనుభవిస్తున్న ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అత్యంత బలంగా ఉందని అన్ని సర్వేల్లో అత్యున్నత గ్రాఫ్‌ కనిపించిందని కోటంరెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. రానున్న ఒకటిన్నర సంవత్సరంలో కూడా ఇదే విధంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నెల్లూరు రూరల్‌కు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా.. తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోటంరెడ్డికి ముఖ్యమంత్రి చెప్పారు.  

మరిన్ని వార్తలు