Local Body Election Results: ఓట్ల తేడా 45 శాతం

23 Sep, 2021 03:04 IST|Sakshi

రెండేళ్ల పాలన అనంతరం సీఎం జగన్‌కు మరింత పెరిగిన ప్రజాదరణ 

అసెంబ్లీ కంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో 17.66 శాతం ఓట్లను అధికంగా సాధించిన వైఎస్సార్‌సీపీ 

67.61 శాతం ఓట్లు అధికార పార్టీకే 

టీడీపీకి 22.79 శాతమే.. విపక్షం ఓట్లలో 16.38% తగ్గుదల   

జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటేసిన 1.30 కోట్ల మంది ఓటర్లు   

సాక్షి, అమరావతి: రెండేళ్ల పాలన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజాదరణ పెద్ద ఎత్తున పెరిగిందని పరిషత్‌ ఎన్నికల ఫలితాలతో మరోసారి స్పష్టమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే 17.66 శాతం అధికంగా ప్రజాదరణ ముఖ్యమంత్రి జగన్‌ పట్ల వ్యక్తం కావడం గమనార్హం. సీఎం జగన్‌ రెండేళ్ల పాలన తర్వాత రాష్ట్రంలో 67.61 శాతం మంది ప్రజల ఆదరణను చూరగొన్నట్లు స్పష్టమైంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 16.38 శాతం మేర ప్రజాదరణను కోల్పోవడం విశేషం. 

రికార్డు స్థాయి ఓట్లతో ప్రారంభం..
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో దాదాపు 50 శాతం ఓట్లను దక్కించుకుని వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన పరిషత్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లతో కలిపి గ్రామీణ ప్రాంతానికి చెందిన 1,30,53,282  మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో 67.61 శాతం ఓట్లను అధికార వైఎస్సార్‌సీపీ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్ధులు దక్కించుకున్నారు. టీడీపీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధులకు 22.79 శాతం ఓట్లు దక్కాయి. మొత్తం ఓటు హక్కు వినియోగించుకున్న 1.30 కోట్ల మందికిపైగా ఓటర్లలో వైఎస్సార్‌సీపీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధులకు 88,25,343 మంది ఓట్లు వేశారు. టీడీపీ అభ్యర్ధులకు 29,75,238 మంది ఓటు వేశారు. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు మిగిలిన ఓట్లు దక్కాయి.

ఇంత వ్యత్యాసం అత్యంత అరుదు..
రెండేళ్ల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల తేడా 45 శాతం ఉండటం రాజకీయాల్లో అత్యంత అరుదైన అంశంగా పలువురు సీనియర్‌ రాజకీయవేత్తలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో దాదాపు సగం మంది ప్రజలు జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేసినట్లుగా భావించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. 

మరిన్ని వార్తలు