పులుల సంరక్షణలో అటవీ సిబ్బంది కృషి భేష్‌ 

30 Jul, 2020 03:37 IST|Sakshi
అటవీ శాఖ రూపొందించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రశంసలు 

ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా బ్రోచర్, పోస్టర్‌ విడుదల 

సాక్షి, అమరావతి: అత్యంత ప్రాధాన్యతాంశమైన పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు, సిబ్బంది చేస్తున్న ప్రత్యేక కృషిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. పులుల సంతతి పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ రూపొందించిన పోస్టర్లు, బ్రోచర్లను బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. పులులు, వన్యప్రాణుల పరిరక్షణ విషయంలో ఆదిమ జాతి చెంచుల కృషిని సీఎం ప్రశంసించారు. ఈ సందర్భంగా పులుల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యలను అటవీ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. వివరాలు ఇలా..

ప్రస్తుతం 60 పులులు  
► 3,727.82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వు (ఎన్‌ఎస్‌టీఆర్‌) దేశంలోనే అతిపెద్దది.  
► ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నా, మన రాష్ట్రంలో చేపడుతున్న సంరక్షణ చర్యల వల్ల ఇక్కడ వాటి సంఖ్య పెరిగింది.  
► కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఎన్‌ఎస్‌టీఆర్‌ (నాగార్జున సాగర్‌– శ్రీశైలం పులుల అభయారణ్యం)లో ప్రస్తుతం 60 పులులు ఉన్నాయి.  
► పులులు, అటవీ వన్య మృగాల సంరక్షణలో రిజర్వు ఫారెస్టులో ఉన్న ఆదిమ చెంచు తెగల వారు  గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు.  
► నాగార్జునసాగర్‌ – శ్రీశైలం టైగర్‌ రిజర్వులో చెంచుల సహకారంతో మానవ వనరులను సమర్థంగా వినియోగించుకుంటున్నాం. ఇందుకుగాను భారత ప్రభుత్వం, నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ ఎక్సలెన్స్‌ అవార్డు లభించింది. 
► ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి ఎన్‌.ప్రతీప్‌ కుమార్, పలువురు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు