మహిళల క్రికెట్‌ జట్టు వరల్డ్‌కప్‌ సాధించడంపై సీఎం జగన్‌ హర్షం

29 Jan, 2023 22:04 IST|Sakshi

తాడేపల్లి:  భారత మహిళల అండర్‌-19 క్రికెట్‌ జట్టు టీ 20 వరల్డ్‌కప్‌ సాధించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టును సీఎం జగన్‌ అభినందించారు. భవిష్యత్తులో జరిగే టోర్నీల్లోనూ విజయాల పరంపర కొనసాగించాలని ఆకాంక్షించారు.

కాగా, తొట్టతొలి అండర్‌ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇవాళ (జనవరి 29) జరిగిన ఫైనల్లో యువ భారత జట్టు ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించి జగజ్జేతగా అవతరించింది. 69 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. షెఫాలీ వర్మ (15), శ్వేత్‌ సెహ్రావత్‌ (5), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (24) పెవిలియన్‌కు చేరగా.. సౌమ్య తివారి (23), హ్రిషత బసు టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో హన్నా బేకర్‌, కెప్టెన్‌ గ్రేస్‌ స్కీవెన్స్‌, అలెక్సా స్టోన్‌హౌస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. భారత బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో 68 పరుగులకే చాపచుట్టేసింది. టిటాస్‌ సాధు, అర్చనా దేవీ, పర్శవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ వెన్నువిరచగా.. మన్నత్‌ కశ్యప్‌, షెఫాలీ వర్మ, సోనమ్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీసి తమ పాత్రకు న్యాయం చేశారు. టీ20 ఫార్మాట్‌లో జరిగిన తొలి వరల్డ్‌కప్‌ను భారత అమ్మాయిలు కైవసం చేసుకోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

మరిన్ని వార్తలు