జనవరి 3న రాజమహేంద్రవరంలో సీఎం జగన్‌ పర్యటన 

29 Dec, 2022 12:30 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలో జనవరి 3న జరిగే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ మాధవీలత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె వివరాలు తెలిపారు. ఆ ప్రకారం.. సీఎం జగన్‌ జనవరి 3వ తేదీ ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి రాజమహేంద్రవరం మున్సిపల్‌ స్టేడియంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు.

అనంతరం రోడ్‌షో ద్వారా ప్రభుత్వ ఆర్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సభా వేదికకు వస్తారు. 13 రకాల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులతో సభాస్థలం వద్ద  ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వైఎస్సార్‌ భరోసా పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచుతూ చేపట్టిన కార్యక్రమంపై ముఖ్యమంత్రి సందేశం ఇస్తారు.

నమూనా చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.  అధికారులందరూ సమన్వయంలో పనిచేసి సీఎం జగన్‌ రాజమహేంద్రవరం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. హెలిప్యాడ్, సీఎం పర్యటించే దారి పొడవునా, సభావేదిక వద్ద బారికేడ్లు తదితర ఏర్పాట్లను ఆర్‌అండ్‌బీ అధికారులు పూర్తి చేయాల్సి ఉందన్నారు.  

చదవండి: (జనసేన నాయకుడి వేధింపుల పర్వం.. ప్రేమిస్తున్నానంటూ హల్‌చల్‌)

మరిన్ని వార్తలు