‘సున్నా వడ్డీ నగదు’ జమ చేసిన సీఎం జగన్‌

23 Apr, 2021 11:45 IST|Sakshi

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ నగదు

ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సీఎం 

మహిళా సాధికారత మా నినాదం కాదు.. మా విధానం

మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది

గత ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసం చేసింది

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: ఇవాళ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 1.02 కోట్ల మందికిపైగా పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వరుసగా రెండో ఏడాది కూడా చెల్లించింది. ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలకు అండగా నిలబడ్డామని పేర్కొన్నారు.

‘‘మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలబడుతూ వస్తున్నాం. మహిళా సాధికారితను ఆచరణలోకి తీసుకురాగలిగాం. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నాం. డ్వాక్రా సంఘాల అప్పుపై ఈ ఏడాది వడ్డీ రూ.1109 కోట్లు చెల్లిసున్నాం. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నాం. అక్కాచెల్లెమ్మలకు వ్యాపారపరంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. మహిళా సాధికారత మా నినాదం కాదు.. మా విధానం. గత ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసం చేసిందని’’ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా.. మహిళలకు 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చేలా చట్టం చేశామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళల రక్షణ కోసం ఎక్కడా రాజీ లేకుండా కృషి చేస్తున్నామని.. రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. మహిళల కేసులు వాదించేందుకు ప్రత్యేక పీపీలను నియమించామని పేర్కొన్నారు. 900 కొత్త వాహనాలను కొనుగోలు చేశామన్నారు. మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

చదవండి: సంక్షేమ పథకాల మొత్తం లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే.. 
అసత్య కథనాలతో ఆందోళన సృష్టించొద్దు

మరిన్ని వార్తలు