సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోంది: సీఎం జగన్‌

20 Oct, 2021 13:52 IST|Sakshi

‘జగనన్న తోడు’ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్లు జమ చేసిన సీఎం జగన్‌ 

సాక్షి, అమరావతి: సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి.. కుల,మత, ప్రాంతం, పార్టీలతో నిమిత్తం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 'జగనన్న తోడు' కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందన్నారు.

ప్రతిపక్షం ఎలా తయారయిందో ప్రజలు చూస్తున్నారు.బూతులు తిడుతూ ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరూ మాట్లాడని బూతులను ప్రతిపక్షం మాట్లాడుతోంది. గతంలో మేం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ఇలాంటి బూతులు మేం ఎప్పుడూ మాట్లాడలేదు. టీడీపీ నేతలు కావాలనే వైషమ్యాలు సృష్టించి రెచ్చగొడుతున్నారు. ప్రతిమాటలోనూ, రాతలోనూ వంచన కనిపిస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా టీడీపీ వెనకాడదని సీఎం అన్నారు. 

లబ్ధిదారుల వడ్డీ సొమ్ము జమ చేసిన సీఎం జగన్‌
'జగనన్న తోడు' కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారుల వడ్డీ సొమ్మును బ్యాంక్‌ ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. బుధవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేశారు. తొలి విడత ‘జగనన్న తోడు’ కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4.5 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.950 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లార చూశానని సీఎం అన్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి కలుగుతుందన్నారు.

‘‘ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.905 కోట్లు పంపిణీ చేశాం. ఇప్పటివరకు సకాలంలో చెల్లించిన 4.50 లక్షల మందికి రూ.16.36 కోట్ల వడ్డీ జమ చేస్తున్నాం. ఏడాదిలో రెండుసార్లు డిసెంబర్‌, జూన్‌లో ‘జగనన్న తోడు’ కార్యక్రమం నిర్వహిస్తాం. రుణాలు చెల్లించిన వారికి కొత్త లోన్లు ఇస్తాం. కొత్త రుణాలతో పాటు కట్టిన వడ్డీని వాపసు ఇస్తామని’’ సీఎం తెలిపారు.

మరిన్ని వార్తలు