Andhra Pradesh: 'ఉద్యోగ' పండగ

19 Jun, 2021 04:21 IST|Sakshi
2021–22 జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఈ రెండేళ్లలో ఏకంగా 6,03,756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగాం

మెరిట్‌ ప్రాతిపదికన ఈ ఏడాది 10,143 ఉద్యోగాల భర్తీ

2021–22 జాబ్‌ క్యాలెండర్‌ విడుదల సందర్భంగా సీఎం జగన్‌

ఏ నోటిఫికేషన్‌ ఏ సమయంలో వస్తుందో స్పష్టంగా చెబుతున్నాం

చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న 7,02,656 మంది అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, ఇతర ఉద్యోగులకు వేతనాలు పెంచాం

50 వేలకుపైగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం

గతంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి.. ఆయనొస్తే జాబు, లేదంటే రూ.2 వేల భృతి అన్నారు

అప్పట్లో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతీ లేదు.. 

ఉద్యోగాలు వచ్చే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు

చదువుకునే పిల్లలకు మంచి చేయడానికి ఇప్పుడు మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది

కోవిడ్‌ పరిస్థితుల్లోనూ ప్రతి సామాజిక వర్గానికి న్యాయం 

గ్రామాల్లోనే ఉపాధి, ఉద్యోగ విప్లవానికి నాంది పలికాం

అప్పటి కేంద్ర ప్రభుత్వంలో గత రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రెండు మంత్రి పదవులు అనుభవించారు. అవకాశం ఉన్న రోజుల్లో వారు రాజీ పడటం వల్ల ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా ఇవ్వాలని విన్నవించుకోవాల్సిన పరిస్థితి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి, లోక్‌సభలో వారికి కావాల్సిన పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి, ఈ రోజు మనం పదేపదే అడగడం తప్ప చేయగలిగింది ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాం. దేవుడి దయతో ఈ పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు మారతాయని సంపూర్ణంగా నమ్ముతున్నాను.     – సీఎం వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: దళారులు, పైరవీలు, రికమండేషన్‌లకు తావు లేకుండా కేవలం రాత పరీక్షలో మెరిట్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలోని 9 నెలల్లో 10,143 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. చదువుకుంటున్న తమ్ముళ్లు, చెల్లెళ్ల కోసం జాబ్‌ క్యాలెండర్‌ను తీసుకువచ్చామని, ఏ నోటిఫికేషన్‌ ఏ సమయంలో వస్తుందో ఈ క్యాలెండర్‌ ద్వారా స్పష్టంగా చెపుతున్నామన్నారు. ఇంటర్వ్యూల విధానానికి పూర్తిగా స్వస్తి చెబుతూ అర్హులకు మాత్రమే ఉద్యోగాలు దక్కేలా చేస్తున్నామని తెలిపారు. కేవలం ఈ రెండేళ్లలో ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు.. 6,03,756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగామని స్పష్టం చేశారు. చాలీచాలని జీతాలతో ఉన్న 7,02,656 మంది ఉద్యోగులకు జీతాలు పెంచగలిగామని చెప్పారు.  శుక్రవారం ఆయన వచ్చే ఏడాది మార్చి వరకు భర్తీ చేసే ఉద్యోగాల వివరాలతో కూడిన 2021–22 జాబ్‌ క్యాలెండర్‌ను తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని, అదిగో ఇదిగో వస్తుందని మీడియాకు లీకులు ఇచ్చేవారని, కళ్లు కాయలు కాచే పరిస్థితిని మనం చూశామన్నారు. ‘నిరుద్యోగులు జిల్లా కేంద్రాలు, సిటీలకు వెళ్లి.. నెలల తరబడి ఇల్లు అద్దెకు తీసుకుని కోచింగ్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ తర్వాత ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇస్తారో తెలియని స్థితిలో ఒక్కోసారి పిల్లలు మనోధైర్యం కోల్పోయే పరిస్థితి ఎదురవుతూ ఉండేది. ఈ పరిస్థితులను మారుస్తూ, వచ్చే తొమ్మిది నెలల కాలంలో అంటే జూలై నుంచి మార్చి 2022 వరకు ఏఏ ఉద్యోగాలు, వాటికి ఏ నెలలో మనందరి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్‌ ఇవ్వబోతోందనే దానిపై జాబ్‌ క్యాలెండర్‌ను ఈ రోజు విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వం వదిలేసిన బ్యాక్‌లాగ్‌ పోస్టులతో సహా రానున్న 9 నెలల్లో ఏఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తామో ఈ రోజు (శుక్రవారం) అన్ని దినపత్రికల్లో మొదటి పేజీలో అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఇచ్చాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..


సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఆప్కాస్‌ ద్వారా దళారీ వ్యవస్థకు చెక్‌
అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకంలో గతంలో రూ.12 వేలు ప్రభుత్వం ఇస్తే.. అది ఉద్యోగికి చేరే సరికి ఏడు, ఎనిమిది వేల రూపాయలకు పడిపోయేది. మధ్యలో దళారీలు.. లంచాలు.. కటింగ్‌లు.. పలు విధాలా నష్టపోయేవారు. ఇవాళ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. ప్రతి నెలా ఒకటవ తేదీన నేరుగా వారికే జీతాలు ఇస్తున్నాం. 
అన్ని ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఉద్యోగాల నియామకాల కోసం ఆప్కాస్‌ (ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్స్‌డ్‌ సర్వీసెస్‌)ను ఏర్పాటు చేసి, దాని ద్వారా దాదాపు 95 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గతంలో ఇచ్చే జీతాలకన్నా, ఈ రోజు చాలా మెరుగైన జీతాలు ఇచ్చేలా చేయగలిగామని సగర్వంగా తెలియచేస్తున్నాను.


51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత
దశాబ్ధాల కాలంగా ఆర్టీసీ కార్మికులు మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని, మా బతుకులు అధ్వాన్నంగా ఉన్నాయని చెబుతుంటే ఎవరూ పట్టించుకోలేదు. అలాంటి పరిస్థితులను పూర్తిగా మారుస్తూ.. ఏటా రూ.3,600 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతున్నా, చిరునవ్వుతో స్వీకరించాం.
ఇచ్చిన మాట ప్రకారం 51,387 మంది ఆర్టీíసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి, వారికి ఉద్యోగ భద్రతను ఇవ్వగలిగాం. వీరి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచామని సగర్వంగా తెలియచేస్తున్నాను. 
ప్రతికూలతలోనూ ఆగని వాగ్దానాలు
ఈ రోజు మనం కోవిడ్‌ పరిస్థితుల్లో ఉన్నాం. రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ తగ్గింది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడి దయతో ఎక్కడా కూడా సంక్షేమం, అభివృద్ధి ఆగలేదు. 
నవరత్నాల అమలు, బడుల నిర్మాణం ఆగలేదు. రైతులు, అక్కచెల్లెమ్మలకు, చదువుకునే పిల్లలకు, అవ్వాతాతలకు, ప్రతి సామాజిక వర్గానికి కూడా న్యాయం చేస్తూ దేవుడి దయతో అడుగులు ముందుకు వేసే కార్యక్రమం సాగుతూనే ఉంది. 

గ్రామాల ముఖచిత్రం మారుతోంది
ఇదివరకు ప్రైవేటు ఉద్యోగాల కోసం రాజధాని హైదరాబాద్‌కు పరిగెత్తుకుంటూ పోయే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితులు మారుతున్నాయి. మన గ్రామంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు వికేంద్రీకరణతో జాబ్‌ మార్కెట్‌ కూడా విస్తరించే పరిస్థితి కనిపిస్తోంది. 
గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. శిథిలావçస్థలో ఉన్న బడులన్నీ నాడు–నేడుతో పూర్తిగా రూపం మార్చుకుని, ఇంగ్లిష్‌ మీడియం వైపు అడుగులు వేస్తున్నాయి. మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తు ఇక్కడే కనిపిస్తోందనే సంకేతాలు ఇస్తున్నాయి. 
మన కళ్ల ముందే విలేజ్‌ క్లినిక్‌లు కొద్ది రోజుల్లో పూర్తవ్వబోతున్నాయి. మన గ్రామంలోనే విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకు అడుగడుగునా చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థతో ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. ఏడాది కాలంలోనే గోడౌన్‌లు, కోల్డ్‌ స్టోరేజీలు తీసుకువస్తున్నాం. ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు, అసైన్డ్‌ ఎక్విప్‌మెంట్లు, డిజిటల్‌ లైబ్రరీలు కూడా ఏర్పాటవుతున్నాయి. 


మన పిల్లలకు మన గ్రామాల్లోనే ఉద్యోగాలు
మనం ఏర్పాటు చేయబోతున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు, ఎనిమిది చోట్ల నిర్మించే హార్బర్లు, 16 కొత్త మెడికల్‌ కాలేజీలు.. ఆసరా, చేయూత పథకాలను లింక్‌ చేస్తూ అమూల్, రిలయన్స్, హిందుస్తాన్‌ లీవర్, ఐటీసీ వంటి సంస్థల ద్వారా ఎంతో మందిని ఉపాధి, ఉద్యోగాల విప్లవానికి చేరువ చేస్తున్నాం. ఇందుకు గ్రామ స్థాయిలోనే నాంది పలికామని సగర్వంగా తెలియచేస్తున్నాను.
పిల్లలను చదివించుకునేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించేలా విద్యావిధానంలో మార్పులు తీసుకువస్తున్నాం. ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేషన్‌ చేసేలా గట్టి సంకల్పంతో అడుగులు వేస్తున్నాం. 
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

4 నెలల్లోనే 1.22 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే గ్రామ సచివాలయాలు వెలిశాయి. ఈ నాలుగు నెలల్లోపే దేశంలో ఎక్కడా, ఎప్పుడూ కనీవినీ ఎరగని విధంగా ఏకంగా 1.22 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని సగర్వంగా తెలియచేస్తున్నాను. 
దీంతో పాటు నిరుద్యోగ యువతలో సేవా భావాన్ని పెంపొందిస్తూ, సామాజిక సేవతో సమాజానికి ఉపయోగపడేలా వలంటీర్లుగా అవకాశం కల్పించాం. వారికి గౌరవ వేతనం ఇస్తూ ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. దాదాపు 2.50 లక్షలకు పైగా నిరుద్యోగులను ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములును చేయగలిగాం. 
ఈ రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగాం. ఇందులో 1,84,264 శాశ్వత  ఉద్యోగాలు, 3,99,791 అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు, 19,701 కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు ఇవ్వగలిగాం. చాలీచాలని జీతాలతో బతుకు బండి ఈడుస్తున్న 7,02,656 మందికి లబ్ధి చేకూర్చేలా, వారందరి వేతనాలను పెంచాం.
కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ తెచ్చి వారి జీతాలు కూడా పెంచాం. 
గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు ఆ ఉద్యోగస్తులందరూ కూడా ఎలా బతికారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నా. ఈ రోజు ప్రకటనలో వారి జీతాల్లో అప్పటికి, ఇప్పటికీ తేడాను స్పష్టంగా వివరించాం. 

హోదాను తాకట్టు పెట్టి మోసం చేశారు
విభజన సమయంలో 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మేం భర్తీ చేస్తామని, వారి మేనిఫెస్టోలో పెట్టి, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మేనిఫేస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితిని ఒకసారి  జ్ఞాపకం చేసుకోవాలి.
చివరికి ప్రత్యేక హోదా ద్వారా అంతో ఇంతో ప్రైవేటు రంగంలో అయినా ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న పరిస్థితిని పూర్తిగా తాకట్టు పెట్టారు. లేని ప్రత్యేక ప్యాకేజీ కోసం, ఓటుకు కోట్ల కోసం పూర్తిగా తాకట్టు పెట్టిన పరిస్థితులు కనిపించాయి. 
గత ప్రభుత్వంలో ఆరోజు అన్న మాటలు కూడా అందరికీ తెలుసు. ఏరకంగా మాటలతో మోసం చేశారో, భ్రమలు కల్పించారో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఫలానా వ్యక్తి వస్తే జాబు వస్తుందని గొప్పగా చెప్పారు. ప్రతి ఇంటికి ఉద్యోగం, ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ ఆ తరువాత ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఎన్నికలకు మూడు నెలలకు ముందు మాత్రం ఒక డ్రామా చేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు