ఆనందోత్సవాల ‘ఆసరా’

15 Oct, 2021 02:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: చెప్పిన సమయానికి చెప్పినట్టుగా.. సరిగ్గా పండుగ సమయంలో వైఎస్సార్‌ ఆసరా పథకం కింద రెండో విడత పొదుపు సంఘాల రుణాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అక్కచెల్లెమ్మలు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నృత్యాలు, కోలాటాలు నిర్వహిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎం వైఎస్‌ జగన్, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటాల చుట్టూ ముగ్గులు వేసి, పూలతో అలంకరించి వాటి చుట్టూ కోలాటాలు నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 7.97 లక్షల పొదుపు సంఘాల్లో ఉన్న 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా కింద ఈ ఏడాది ప్రభుత్వం రూ.6,439 కోట్లు చెల్లిస్తోంది.

రెండో విడత నగదు చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ నెల 7 నుంచి లబ్ధిదారులతో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా 54 మండలాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. 7 నుంచి ఇప్పటివరకు 12 జిల్లాల పరిధిలో మొత్తం 556 చోట్ల ఆసరా వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. 

జిల్లాల్లో ఘనంగా ఆసరా ఉత్సవాలు..
వైఎస్సార్‌ ఆసరా కింద రెండో విడత నగదు సాయానికి సంబంధించిన చెక్కులను గురువారం ప్రకాశం జిల్లావ్యాప్తంగా అందజేశారు. త్రిపురాంతకంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా ఆసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో చెక్కులు పంపిణీ చేశారు.

కృష్ణా జిల్లా పామర్రులో డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, వెలుగు సిబ్బంది సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటాన్ని పాలతో అభిషేకించారు. పెడన మండలంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే జోగి రమేష్‌.. అక్కచెల్లెమ్మలకు రూ.6,79,88,739 చెక్కును అందజేశారు. విజయనగరం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌ ఆసరా ఉత్సవాలు సందడిగా సాగాయి. రుణమాఫీ చెక్కులను అందుకున్న అక్కచెల్లెమ్మలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. బాడంగి మండలంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు చెక్కులు అందజేశారు.

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం గుళ్లపల్లిలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్‌ ఆసరా చెక్కులు అందించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతీనగర్‌లో తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ చక్రవర్తి ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. గూడూరు మునిసిపల్‌ కార్యాలయం ఆవరణలో సీఎం జగన్‌ చిత్రపటానికి అక్కచెల్లెమ్మలు క్షీరాభిషేకం చేశారు.

   

మరిన్ని వార్తలు