రెండో విడత ‘వైఎస్సార్‌ ఆసరా’ ప్రారంభించిన సీఎం

7 Oct, 2021 12:48 IST|Sakshi

చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారు

బాబు హయాంలో పొదుపు సంఘాలు నిర్వీర్యం

‘వైఎస్సార్‌ ఆసరా’ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, ప్రకాశం జిల్లా: నేటి నుంచి ఈ నెల 18 వరకు ‘వైఎస్సార్‌ ఆసరా’ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ‘వైఎస్సార్‌ ఆసరా’ రెండో విడత కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అందరి బాధలు చూశానన్నారు. పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

రెండో విడత కింద రూ.6,439.52 కోట్లు జమ చేస్తున్నాం. నాలుగు విడతల్లో రూ.25,517 కోట్లు జమ చేస్తాం. కోడ్‌ దృష్ట్యా వైఎస్సార్‌ జిల్లాలో నవంబర్‌ 6 నుంచి 15 వరకు ఆసరా పథకం అమలు చేస్తామన్నారు. దేవి నవరాత్రుల్లో ప్రారంభించడం శుభపరిణామం అన్నారు. రుణ మాఫీ చేస్తామన్న చంద్రబాబు.. డ్వాక్రా మహిళలను మోసం చేశారు. చంద్రబాబు మాట నమ్మి డ్వాక్రా మహిళలు అప్పుల్లో కూరుకుపోయారని సీఎం అన్నారు. ‘బాబు హయాంలో పొదుపు సంఘాలు నిర్వీర్యమైపోయాయి. చంద్రబాబు హయాలో ‘సున్నావడ్డీ’ పథకం కూడా రద్దు చేశారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని పునఃప్రారంభించాం. ప్రభుత్వ సహకారంతో డ్వాక్రా సంఘాలు నిలబడగలిగాయి. పంచాయతీ నుంచి పరిషత్‌ ఎన్నికల వరకు ప్రజా ఆదరణ మరువలేం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

సున్నా వడ్డీ పథకం ద్వారా 95 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. మహిళలకు సాంకేతికత, బ్యాంకింగ్‌ రంగాల్లో శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించాం. కార్పొరేట్‌ సంస్థలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నాం. ప్రభుత్వ చొరవతో 3 లక్షలకుపైగా మహిళలు వివిధ వ్యాపారాలు ప్రారంభించారు. నెలకు రూ.7వేల నుంచి రూ.10వేలకుపైగా అదనపు ఆదాయం పొందుతున్నారు. హోంమంత్రిగా తొలిసారి మహిళకు అవకాశం ఇచ్చాం. జగనన్న కాలనీల ద్వారా 1.25 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. రాష్ట్రంలో 67.47 శాతం పదవులు మహిళలకు కేటాయించాం. రాష్ట్రంలో రూ.1450 కోట్లు ఖర్చుచేసి 61 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని’’ సీఎం అన్నారు.

మరిన్ని వార్తలు