YS Jagan: అండగా నిలవండి

2 Dec, 2021 03:13 IST|Sakshi

నీతి ఆయోగ్‌ బృందంతో భేటీలో ముఖ్యమంత్రి జగన్‌ వినతి

ఏపీ పురోగతికి తోడ్పాటునివ్వండి

రుణభారంతో ఉన్న విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలను ఆదుకోవాలి

తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలు, కేంద్రం నుంచి రెవెన్యూ లోటు నిధులిప్పించండి 

సాక్షి, అమరావతి: రాష్ట్ర పురోగతికి కేంద్రంతో పాటు నీతి ఆయోగ్‌ కూడా అన్ని విధాలుగా అండగా నిలిచి పూర్తి సహకారాన్ని అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ బృందం బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్, ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్‌ నీతి ఆయోగ్‌ బృందానికి వివరించారు. తీవ్ర రుణభారంతో ఉన్న విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలను గాడిలో పెట్టడానికి సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో విద్యా సంస్కరణలు చేపట్టి స్కూళ్లను ఆరు రకాల కేటగిరీలుగా విభజించామని, సబ్జెక్టుల వారీగా బోధన, పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమించేలా చర్యలు తీసుకున్నామని వివరించగా.. రాజీవ్‌ ప్రశంసించారు. సుపరిపాలన కోసం తెచ్చిన మార్పులు, నవరత్నాలు, మహిళా సాధికారత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాల గురించి సంబంధిత అధికారులు నీతి ఆయోగ్‌ బృందానికి సమగ్రంగా వివరించారు.  

సేంద్రియ ఉత్పత్తులపై దృష్టి 
ఆర్బీకేల ద్వారా ఆర్గానిక్‌ పంటల ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని, రైతులకు మంచి ఆదాయం వస్తుందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సూచించగా.. ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు అధికారులన్నారు.  

ఆరోగ్యశ్రీపై ఆసక్తిగా.. 
వైద్య, ఆరోగ్య రంగంలో తీసుకున్న పలు చర్యలను నీతి ఆయోగ్‌ బృందానికి అధికారులు వివరించారు. వైఎస్సార్‌ విలేజ్‌ అర్బన్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, కొత్తగా మెడికల్‌ కాలేజీలు, హెల్త్‌ హబ్స్, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు, నాడు – నేడు ద్వారా ఆస్పత్రుల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల పెంపు, భారీగా వైద్య సిబ్బంది నియామకాలు, తల్లులు, పిల్లల ఆరోగ్యంపై దృష్టి, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియచేశారు. మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ అమలు తీరును నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. 

అమ్మ ఒడిపై పూర్తి వివరాలు.. 
విద్యా రంగంలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, అమలు చేస్తున్న పథకాలను అధికారులు వివరించగా అమ్మ ఒడి పూర్తి వివరాలపై నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ ఆరా తీశారు.  

మహిళా సాధికారత.. 
మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని చేయూత, ఆసరా, పెన్షన్లు తదితర కార్యక్రమాల గురించి అధికారులు వివరించారు. ఆసరా, చేయూత ఉద్దేశాలు, సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం అమలు చేస్తున్న ఉపాధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్‌ నీతి ఆయోగ్‌ చైర్మన్‌కు తెలియచేశారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం గురించి అధికారులు వివరించారు.  

దిశ యాప్‌పై ప్రశంసలు 
‘దిశ’ కింద మహిళల భద్రత కోసం తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. దిశ యాప్‌ను ప్రశంసించిన నీతి ఆయోగ్‌ చైర్మన్‌ దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి వివరాలు సేకరించాలని తన బృందానికి సూచించారు. 

విద్యుత్‌ రంగం – విభజన సమస్యలు 
రాష్ట్ర విద్యుత్‌ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అధికారులు నీతి ఆయోగ్‌ దృష్టికి తెచ్చారు. తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6,284 కోట్ల విద్యుత్‌ బకాయిలు ఇప్పించేలా కృషి చేయాలని కోరారు. రెవెన్యూ లోటు కింద కాగ్‌ నిర్ధారించిన విధంగా ఇంకా రావాల్సిన రూ.18,969 కోట్ల నిధులు విడుదలయ్యేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను కోల్పోవడంతో పెద్ద ఎత్తున ఆదాయానికి గండి పడిందని గణాంకాలతో సహా వివరించారు. ప్రఖ్యాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కోల్పోయామని, సహజ వనరుల విషయంలోనూ ఇబ్బంది తలెత్తిందన్నారు.  

పలు పథకాలపై బృందానికి వివరాలు... 
వైఎస్సార్‌ ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ పంట రుణాలు, పంటల బీమా, ధరల స్థిరీకరణ, ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం  చెల్లింపు, అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్, అమూల్‌తో చేపట్టిన ప్రాజెక్టు వివరాలు, రూ.3,176.61 కోట్లతో నిర్మించనున్న 8 ఫిషింగ్‌ హార్బర్లు, 4 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, ఆక్వా హబ్స్, ప్రాసెసింగ్‌ యూనిట్లు, మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ, చేపల వేట నిషేధ కాలంలో ఆర్థిక సహాయం తదితరాల గురించి అధికారులు తెలియచేశారు. 

కడప స్టీల్‌ ప్లాంట్, పోర్టులు, ప్రాజెక్టులు.. 
విభజన హామీ ప్రకారం కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం అనంతపురంలో నాలుగు ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని, జీఎస్టీ రీయింబర్స్‌ సహా మరికొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులు నీతి ఆయోగ్‌కు నివేదించారు. రాష్ట్రంలో నిర్మించనున్న పోర్టులకు ఆర్థిక సహాయం అందించాలని, పోలవరం సకాలంలో పూర్తయ్యేలా సవరించిన అంచనా వ్యయం ఆమోదం పొందేలా సహకరించాలని కోరారు.

రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు తగిన విధంగా నిధులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు. అప్పర్‌ సీలేరులో కొత్తగా నిర్మించ తలపెట్టిన 1,350 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టుకు సహాయం అందించాలని విన్నవించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత లేకపోవడంతో రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోందని వివరించారు.   

మరిన్ని వార్తలు