ఆ ఘటనలు పునరావృతం కాకూడదు: సీఎం జగన్‌

25 Sep, 2020 15:37 IST|Sakshi

వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, సన్నద్ధతపై సీఎం సమీక్ష

సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, సన్నద్ధతపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని, ఎట్టి పరిస్ధితుల్లో ఏ సమస్యలు రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ పంట కూడా ఆర్‌బీకే నుంచి ప్రొక్యూర్‌ చేయాలని, పంటలకు కనీస గిట్టుబాటు ధర తప్పకుండా రావాలని పేర్కొన్నారు. (చదవండి: ఎస్పీ బాలు మృతికి సీఎం జగన్‌ సంతాపం)

‘‘ప్రతీ ఆర్‌బీకే వద్ద పంటలన కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)పై పెద్ద డిస్‌ప్లే బోర్డు ఉండాలి. భవిష్యత్తులో ఆర్‌బీకేలు ధాన్యం సేకరణకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రాలుగా నిలవాలి. రైతులు ఎక్కడ ఏ పంట వేయకూడదో అది పక్కగా చూసుకోవాలి. దీన్ని సీరియస్‌గా ఎన్‌ఫోర్స్‌ చేయాలి. ఆ మేరకు వారికి సలహా ఇవ్వాలి. ఏ పంట వేస్తే లాభం? దేనికి ధర ఉంది? వంటి అన్ని అంశాలపై రైతులకు చెప్పడంతో పాటు, ఆ తర్వాత వారికి అంతే డబ్బు వచ్చే మార్గం చూపాలి. పంటలు పండిన తర్వాత మార్కెటింగ్‌ ఇబ్బందులు రాకుండా చూడాలి. వీటన్నింటినీ జాయింట్‌ కలెక్టర్లు చూడాలి. వారు రైతులకు అన్ని విషయాలు క్లియర్‌గా చెప్పాలి. వాటర్‌ రియాలిటీ, మార్కెట్‌ రియాలిటీ ఆధారంగా జేసీలు రైతులకు అవగాహన కల్పించాలి. ఆ తర్వాత పంటల అమ్మకాలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందని చెప్పాలి. ఈ ప్రక్రియలో స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలను కూడా ఇన్‌వాల్వ్‌ చేయాలి. సార్టెక్స్‌ వెరైటీని ప్రమోట్‌ చేయాలి. బ్రొకెన్‌ రైస్‌ను కూడా వాల్యూ ఎడిషన్‌ చేయాలని’’ సీఎం సూచించారు.

కాటన్‌ కొనుగోళ్ళలో స్కామ్‌లు జరగకూడదని, కొత్తగా మనం ఎలా కొనుగోలు చేస్తున్నాం అనేది ఈసారి చూపాలని సీఎం అన్నారు. పత్తి రైతులకు న్యాయం జరగాలని, మన ప్రభుత్వ హయాంలో రెప్యుటేషన్‌ పోగొట్టుకోకూడదని సీఎం స్పష్టం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెంచి రైతుకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందో చూసి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మీద మరింత ఫోకస్‌ పెట్టడంతో పాటు బహిరంగ మార్కెట్‌లో ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుదారుల వివరాల డేటాను ఆ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తద్వారా రైతుల ఉత్పత్తులకు మరింత మార్కెట్‌ సదుపాయం కలిగేలా చేసి రైతులకు మేలు చేయాలన్నారు. ఈ సీజన్‌లో కూడా దాదాపు రూ.3300 కోట్ల మేర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరగాలని, ఆ మేరకు ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేశామని సీఎం వైఎస్‌ జగన్ పేర్కొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా