-

100 శాతం ‘మద్దతు’

9 Aug, 2022 03:05 IST|Sakshi

పంట విక్రయించిన ప్రతి రైతన్నకూ మద్దతు ధర దక్కాల్సిందే: సీఎం వైఎస్‌ జగన్‌

ఎమ్మెస్పీ కంటే ఒక్క పైసా కూడా తగ్గడానికి వీల్లేదు

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రకు స్వస్తి 

గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం 

రైతులకు అవగాహన కల్పిస్తూ మోసాలకు అడ్డుకట్ట

ఖరీఫ్, రబీ అనంతరం భూసార పరీక్షలతో రైతన్నలకు సూచనలు

రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడంపై దృష్టి

ఆర్బీకేల ద్వారా సేవలందించే శాఖల మధ్య సమన్వయంతో మంచి ఫలితాలు

రైతు భరోసా కేంద్రాలు.. పొలం డాక్టర్ల మాదిరిగా రైతన్నలకు సేవలందించాలి

పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. కనీస మద్దతు ధర కంటే ఒక్క పైసా కూడా తగ్గకుండా కొనుగోళ్లు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రకు స్వస్తి పలకాలన్నారు. వే బ్రిడ్జిలను క్రమంగా దశలవారీగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల పరిధిలోకి తేవడంతోపాటు గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగులను ధాన్యం కొనుగోళ్లలో భాగస్వాములను చేసి ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..
పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

నాణ్యత పరీక్షలు..
అన్నదాతలకు మేలు చేసేలా ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం క్వాలిటీ, క్వాంటిటీ టెస్టింగ్‌ చేయాలి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ఎంఎస్‌పీకి సంబంధించి అన్నదాతలకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం విస్తృతంగా కరపత్రాల ముద్రణ చేపట్టి పోస్టర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలి. ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలను నివారించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

నమన్వయంతో సమర్థంగా..
రైతులకు అండగా నిలుస్తూ ఆర్బీకేలు పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు.. మత్స్య, పశుసంవర్థక, ఉచిత విద్యుత్, సీహెచ్‌జీల నిర్వహణ ఇలా అన్నీ చేస్తున్నాం. వీటిని మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలంటే సంబంధిత శాఖల మధ్య (లైన్‌ డిపార్ట్‌మెంట్స్‌) చక్కటి సమన్వయం అవసరం. ముఖ్యంగా వ్యవసాయ, మత్స్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ తదితర శాఖల మధ్య సమన్వయం సమర్థంగా ఉండాలి. ఈ ప్రక్రియలో సజావుగా ముందుకు సాగేలా పటిష్ట మార్గదర్శకాలు, ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలి.

భూసార పరీక్ష కార్డులు 
విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు, రసాయనాలు వాడకుండా నివారించడంపై అధికారులు దృష్టి పెట్టాలి. ఖరీఫ్, రబీ సీజన్లు ముగిసిన తరువాత దాదాపు రెండు నెలలు పంట విరామం ఉంటుంది. ఆ సమయంలో భూసార పరీక్షలన్నీ నిర్వహించి వాటి ఫలితాల ప్రకారం ఆ భూమికి ఎలాంటి పోషకాలు, ఎరువులు వాడాలో సూచించాలి. ప్రతి రైతుకూ తన సాగు భూమికి సంబంధించిన భూసార పరీక్ష కార్డులను క్రమం తప్పకుండా అందించే కార్యక్రమాన్ని రూపొందించాలి. ఎంత మోతాదులో ఎరువులు, పురుగు మందులు వాడాలో çస్పష్టమైన అవగాహన కల్పించాలి. 

డాక్టర్‌లా ఆర్బీకేలు
ఒక మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు డాక్టర్‌ ఎలా సేవలందిస్తారో పంటల సాగులో ఆర్బీకేలు కూడా అదే విధంగా రైతన్నలకు ఉపయోగపడాలి. ఆర్బీకేలు ఒక రకంగా పొలం డాక్టర్ల మాదిరిగా పనిచేయాలి. వైద్యారోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం తరహాలో క్రమం తప్పకుండా గ్రామాల్లో ఆర్బీకేలు రైతులకు సలహాలు, సూచనలు అందచేయాలి.

హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు
పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, వ్యవసాయ శాఖ కమిషనర్‌ సి.హరికిరణ్, మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, పౌరసరఫరాల కార్పొరేషన్‌ వీసీ, ఎండీ వీరపాండ్యన్‌ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు