సమగ్ర భూ సర్వేతో శాశ్వత భూ హక్కు

23 Oct, 2020 03:29 IST|Sakshi

ఇదే లక్ష్యంగా జనవరి 1న సర్వే మొదలు కావాలి

రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్

ఈ సర్వే ద్వారా పక్కాగా భూ రికార్డుల డిజిటలైజేషన్‌

రికార్డులు తారుమారు చేసేందుకు వీలుండదు

1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో సర్వే

త్వరలో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు

ఆ మేరకు సర్వేయర్లు కూడా ఉండాలి

వందేళ్ల తర్వాత ఈ సర్వే  జరుగుతోంది. దీనివల్ల రాష్ట్రంలో భూ రికార్డుల డిజిటలైజేషన్‌ పక్కాగా అవుతుంది. అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్‌లు, రోవర్స్‌ ఉపయోగించి దేశంలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహిస్తున్నాం. అనంతరం హార్డ్‌ కాపీని సంబంధిత భూ యజమానికి అందజేస్తాం.
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: శాశ్వత భూ హక్కు కల్పనే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సర్వేను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు అనుకుంటున్నట్లు వచ్చే ఏడాది జనవరి 1న భూ సర్వే మొదలు కావాలని, నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. 
రికార్డుల ట్యాంపర్‌కు అవకాశం ఉండదు

 రాష్ట్ర వ్యాప్తంగా 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలోని వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలు, మున్సిపాలిటీలలో ఈ సర్వే కొనసాగుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, పక్కాగా సర్వే చేస్తాం. 
► గతంలో రికార్డులు ట్యాంపర్‌ చేయడానికి చాలా అవకాశం ఉండేది. ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ డిజిటలైజేషన్‌ జరుగుతుంది.
త్వరలో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి కాబట్టి, ఆ మేరకు సర్వేయర్లు కూడా ఉండాలి. సచివాలయాల్లో ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. 

4,500 బృందాలతో సర్వే
 ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4,500 బృందాలు పని చేస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్‌) ద్వారా శాటిలైట్‌ ఫొటోలు పొందడం, ఆ ఇమేజ్‌ను ప్రాసెస్‌ చేయడం, క్షేత్ర స్థాయి పరిశీలన, ఆ తర్వాత సమగ్ర సర్వే సెటిల్‌మెంట్‌ కొనసాగుతుందని, డ్రోన్ల ద్వారా గ్రామ కంఠాలను స్పష్టంగా ఫొటో తీస్తామని చెప్పారు. 
వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభమయ్యే సమగ్ర భూ సర్వే రెండేళ్లలో అంటే జనవరి 2023 నాటికి మూడు దశల్లో పూర్తవుతుందన్నారు. 
ఇందు కోసం 70 కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్స్‌(బేస్‌ స్టేషన్లు) ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే కొన్ని ఏర్పాటయ్యాయని చెప్పారు. మొబైల్‌ (విలేజ్‌) కోర్టులు కూడా ఏర్పాటు అవుతున్నందున వివాదాలు ఎక్కడికక్కడే వేగంగా పరిష్కారమవుతాయన్నారు.
సర్వే ఏర్పాట్లు, టైటిల్‌ తదితర వివరాలతో కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో ప్రయోగాత్మకంగా చేపట్టిన భూ సర్వే వివరాలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.
ఈ కార్యక్రమానికి ‘వైఎస్సార్‌–జగనన్న సమగ్ర భూ సర్వే’ లేదా ‘రాజన్న–జగనన్న సమగ్ర భూ సర్వే’ అని పేరు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ ప్రసాద్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ ఐజీ సిద్థార్థజైన్, రెవెన్యూ శాఖకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు