కోవిడ్‌ ప్రొటోకాల్‌.. స్కూళ్లలో తప్పనిసరి

18 Aug, 2021 02:10 IST|Sakshi

కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్, ప్రొటోకాల్‌పై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌  

విద్యా శాఖతో వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పని చేయాలి

స్కూళ్లలో టెస్టింగ్‌కు చర్యలు తీసుకోవాలి

గ్రామ, వార్డు సచివాలయం యూనిట్‌గా వ్యాక్సినేషన్‌ 

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు కర్ఫ్యూ సడలింపు 

తెల్లవారుజామున పెళ్లిళ్లకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలి

150 మందికి మించకుండా ఉంటే బావుంటుందని సూచన

సాక్షి, అమరావతి: స్కూళ్లలో కోవిడ్‌ ప్రొటోకాల్‌ను సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రస్తుత తరుణంలో విద్యా శాఖతో వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని, ఆ మేరకు అధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్, ప్రొటోకాల్‌ అమలు, థర్డ్‌వేవ్‌ సన్నద్ధతపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్కూళ్లలో టెస్టింగ్‌కు చర్యలు తీసుకోవాలని, ఒక వేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా చూడాలని సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ ఇచ్చుకుంటూ వెళ్లాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఇస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున పెళ్లిళ్లుంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. పెళ్లిళ్లలో 150 మందిలోపే ఉండేలా చూసుకుంటే బావుంటుందని సూచించారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితి గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

– యాక్టివ్‌ కేసులు : 17,218
– రికవరీ రేటు శాతం : 98.45 
– పాజిటివిటీ రేటు శాతం : 1.94  
– 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదైన జిల్లాలు : 10
– 3 నుంచి 6 శాతంలోపు పాజిటివిటీ నమోదైన జిల్లాలు : 3
– నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న వారి శాతం : 93.98 
– ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న వారి శాతం : 74.82 
– 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఇన్‌ కమింగ్‌ కాల్స్‌ : 571
– థర్డ్‌ వేవ్‌ సన్నద్దతలో భాగంగా అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ : 20,464
– డి టైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు : 27,311
– ఆగస్టు ఆఖరుకు 104 చోట్ల ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్ల ఏర్పాటు పూర్తి. సెప్టెంబర్‌ రెండో వారానికి మరో 36 చోట్ల పూర్తి. 

మరిన్ని వార్తలు