జవాబుదారీతనం

28 Jul, 2020 02:37 IST|Sakshi

నగర, పట్టణ ప్రాంతాల్లో పౌరులకు నాణ్యమైన సేవలు అందించాలి

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు మార్గదర్శకాలపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

నాణ్యమైన సేవలను నిర్ధారించడానికి ఒక యంత్రాంగం ఉండాలి

పరిశ్రమల కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి 

కార్మికుల ప్రయోజనాలకు భంగం కలగకూడదు

విద్యుత్‌ సంస్కరణల విషయంలో ముందున్నాం

కేంద్ర మార్గదర్శకాలు పరిశీలించి తదుపరి చర్యలు

నగర, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన తాగునీరు, పారిశుధ్యం.. తదితర అంశాల్లో నాణ్యమైన సేవలు అందాలి. ఈ సేవలు అందనప్పుడు వాటికి ఫీజులు అడగడం సరికాదు. నాణ్యమైన సేవలు అందించడమన్నది పరిపాలనలో ఒక ప్రమాణంగా ఉండాలి. సేవలు నాణ్యంగా ఉన్నాయా? లేదా? అన్నదాన్ని నిర్ధారించడానికి ఒక యంత్రాంగం ఉండాలి. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: పౌరుల సమస్యల పట్ల జవాబుదారీతనం ఉండాలని, నాణ్యమైన సేవలు అందించడమే పరిపాలనలో ప్రమాణం కావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం – ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) పరిమితిని పెంచాలన్న రాష్ట్రాల కోరికపై కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు సంబంధించి సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా వన్‌ నేషన్‌ – వన్‌ రేషన్‌ కార్డు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, మున్సిపాల్టీలు–కార్పొరేషన్ల స్వయం సమృద్ధి, విద్యుత్, కార్మిక రంగాల్లో కేంద్రం.. రాష్ట్రాలకు సూచించిన సంస్కరణల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్వయం సమృద్ధిపై సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పౌరుల సమస్యల పరిష్కారం, నాణ్యమైన సేవలు అందించడంపై దృష్టి సారించాలన్నారు. కేంద్రం పంపిన సంస్కరణల మార్గదర్శకాలను పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. 
 
రాష్ట్రంలో ఇప్పటికే పోర్టబిలిటీ సదుపాయం 
– దేశంలో ఎక్కడైనా సరే రేషన్‌ పొందేలా కేంద్రం వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే పోర్టబిలిటీ సదుపాయం ఉందని, రేషన్‌ పంపిణీలో పారదర్శకత కోసం బయోమెట్రిక్‌ విధానాన్ని అనుసరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. 
– ఈ విధానంలో రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. బియ్యం కార్డులు, వాటి లబ్ధిదారులతో ఆధార్‌ సీడింగ్‌ ప్రక్రియ దాదాపుగా పూర్తికావొచ్చిందన్నారు. నవశకం ద్వారా తీసుకున్న దరఖాస్తులు, వాటిలో అర్హులుగా గుర్తించిన వారితో కలుపుకుని దాదాపు 1.39 కోట్ల మందికి బియ్యం కార్డులు ఉన్నాయని స్పష్టం చేశారు. 

పరిశ్రమల భద్రత కూడా ముఖ్యం
– ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం కేంద్రం చెప్పిన సంస్కరణల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ముందంజలో ఉందని అధికారులు వివరించారు. రెడ్‌ టేపిజానికి దూరంగా సింగిల్‌ విండో విధానాలు అనుసరిస్తూ, అనుమతుల విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు.
– రెన్యువల్స్‌ విషయంలో పారిశ్రామిక వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. పరిశ్రమలు ఎంత ముఖ్యమో, వాటి భద్రత కూడా ముఖ్యమని, వాటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 
– పరిశ్రమల్లో కాలుష్యం, భద్రతకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. విశాఖపట్నంలో గ్యాస్‌ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలన్నారు. 
– పరిశ్రమల్లో కాలుష్యంపైగానీ, భద్రతపైన గానీ ఫిర్యాదు లేదా సమాచారం రాగానే స్పందించేలా ఈ యంత్రాంగం ఉండాలని స్పష్టం చేశారు. కాలుష్య తనిఖీలతోపాటు కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలని ఆదేశించారు. 

కార్మికులకు పనికి తగ్గ వేతనం లభించాలి  
– కార్మిక సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు నిర్దేశించిన సంస్కరణలపై సమావేశంలో చర్చ జరిగింది. కోవిడ్‌ లాంటి విపత్తు నుంచి తిరిగి పారిశ్రామిక రంగాన్ని పట్టాలపైకి తీసుకొచ్చి, వేగంగా నడిపించడానికి.. మరిన్ని ఉద్యోగాల కల్పన కోసం ఈ సంస్కరణలు తీసుకు రావాలని కేంద్రం చెబుతోందని అధికారులు వివరించారు. 
– ఈ ప్రయత్నంలో కార్మికుల ప్రయోజనాలకు భంగం కలగకూడదని సీఎం స్పష్టం చేశారు. వారి పనికి తగ్గ వేతనం లభించేలా చూడాలన్నారు. 

రబీ నుంచి రైతులకు సంపూర్ణంగా నాణ్యమైన విద్యుత్‌ 
– విద్యుత్‌ రంగం సంస్కరణల్లో భాగంగా విద్యుత్‌ సరఫరా, సాంకేతిక నష్టాలను తగ్గించాలని.. ఏసీఎస్‌– ఏఆర్‌ఆర్‌ మధ్య ఉన్న తేడాను తగ్గించాలన్న కేంద్రం సూచనలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ రంగంలో తీసుకున్న చర్యలపై సమావేశంలో ప్రస్తావించారు. 
– మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. కరెంటు సరఫరా నష్టాలు రాష్ట్రంలో చాలా తక్కువని అధికారులు వివరించారు. డిస్కంలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించుకుంటూ వాటిని కష్టాల నుంచి బయటకు పడేసే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. 
– ఉచిత విద్యుత్‌ రూపంలో ప్రభుత్వంపై భారాన్ని తగ్గించుకునేందుకు, పగటి పూటే 9 గంటల కరెంటు ఇచ్చేందుకు దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా 10 వేల మెగావాట్ల సోలార్‌ కరెంటు ప్రాజెక్టును తీసుకొస్తున్నామన్నారు. దీనివల్ల తక్కువ ధరకే ప్రభుత్వానికి విద్యుత్‌ వస్తుందని, దీన్ని రైతులకు అందిస్తుందని పేర్కొన్నారు. 
– పగటి పూట 9 గంటల కరెంటు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫీడర్లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని, ఇప్పటికే దీనికి సంబంధించి 82 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయయని సీఎం చెప్పారు. మిగిలిన పనులు కూడా పూర్తి అయితే రబీ నుంచి నూటికి నూరు శాతం సంపూర్ణంగా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ లభిస్తుందని అన్నారు. విద్యుత్‌ సంస్కరణల విషయంలో మనం చాలా అడుగులు ముందుకేస్తున్నామని అధికారులు తెలిపారు. 
– సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక, విద్యుత్, పౌరసరఫరాలు, కార్మిక, పరిశ్రమల శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు