Andhra Pradesh: సాగునీటి సవ్వడులు

11 May, 2022 04:16 IST|Sakshi

చకచకా పనులు.. పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష 

గడువులోగా పూర్తి చేసి రైతులకు ఫలాలు అందించాలి 

జలవనరుల శాఖకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం 

పోలవరాన్ని వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల వ్యయం 

రూ.2,559.37 కోట్ల రీయింబర్స్‌పై జల్‌ శక్తి శాఖతో చర్చించాలి 

గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్‌లోకి వంశధార ఎత్తిపోతలకు గ్రీన్‌ సిగ్నల్‌ 

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సకాలంలో పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించాలని జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలవరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి వేగంగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి నిధులను ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. దీనికి సంబంధించి  రూ.2,559.37 కోట్లు కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సి ఉందని, జల్‌ శక్తితో చర్చించి త్వరగా నిధులు రప్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

గొట్టా బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి హిర మండలం రిజర్వాయర్‌ను నింపేలా ఎత్తిపోతల పనులకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయడంతోపాటు నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. సాగునీటి పనులపై మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష  నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 29న జరిగిన సమీక్షలో నిర్దేశించిన లక్ష్యాలు, తీసుకున్న చర్యలపై అధికారుల నివేదిక ఆధారంగా ప్రాజెక్టుల వారీగా సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యాంశాలు ఇవీ...
సాగునీటి పనులపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

రేపు సీడబ్ల్యూసీ రాక.. డిజైన్లపై నెలాఖరుకు స్పష్టత
పోలవరం దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను జూలై 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర్తి కాగా కోతకు గురైన ప్రాంతం ఇసుకతో పూడ్చివేత పనులు 76 శాతం పూర్తి చేసినట్లు వివరించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ డిజైన్లపై ఇన్వెస్టిగేషన్‌ పూర్తైన నేపథ్యంలో ఈనెల 11న సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అధికారులు పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈనెల 18న డిజైన్లపై డీడీఆర్పీ(డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) సమావేశం జరగనుంది. డిజైన్లపై నెలాఖరుకు స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

పీపీఏ అనుమతితోనే పోలవరం పనులు..
పోలవరం నిర్మాణానికి సంబంధించి ఇంకా రూ.2,559.37 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ.. పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) అనుమతి ఇచ్చిన తర్వాతే ప్రతి పనీ జరుగుతోందన్నారు. పనులను వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డబ్బులు ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. కేంద్ర అధికారులతో సమావేశం సందర్భంగా రీయింబర్స్‌ అంశాన్ని ప్రస్తావించాలని ఆదేశించారు.

పెన్నాపై సకాలంలో జంట బ్యారేజీలు..
నెల్లూరు, సంగం బ్యారేజీ పనుల పురోగతిని వివరిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు సకాలంలో వీటిని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు టన్నెల్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.

వాయువేగంతో వెలిగొండ సొరంగం 
► వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని సమీక్షలో అధికారులు తెలిపారు.
► 2014–19 మధ్య గత సర్కారు హయాంలో టన్నెల్‌ –1 పనులు కేవలం 4.33 కిలోమీటర్లు మాత్రమే జరిగాయి. అంటే రోజుకు కేవలం 2.14 మీటర్ల పని మాత్రమే గత ప్రభుత్వ హయాంలో జరిగిందని అధికారులు వెల్లడించారు.
► వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక 2019–2022 వరకు కేవలం మూడేళ్ల వ్యవధిలోనే 2.8 కిలోమీటర్లు తవ్వి మొదటి టన్నెల్‌ను పూర్తి చేశారు. అంటే రోజుకు 4.12 మీటర్ల మేరకు టన్నెల్‌ పనులు జరిగాయని అధికారులు తెలిపారు.
► వెలిగొండ టన్నెల్‌–2కు సంబంధించి 2014–2019 మధ్య రోజుకు 1.31 మీటర్ల పని మాత్రమే జరగ్గా 2019–22 మధ్య రోజుకు 2.46 మీటర్ల పనులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకు 500 మీటర్లపైన టన్నెల్‌ తవ్వకం పనులు చేస్తున్నట్లు చెప్పారు.
► సెప్టెంబరులో టన్నెల్‌–1 ద్వారా వెలిగొండలో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
► టన్నెల్‌–1 ద్వారా నీటిని విడుదల చేస్తూనే టన్నెల్‌–2లో పనులను నిర్విఘ్నంగా కొనసాగించి 2023 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. ఆలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్‌లోకి వంశధార ఎత్తిపోత..
► కేంద్రానికి సమర్పించిన వంశధార ట్రిబ్యునల్‌ తుది నివేదికపై ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎస్సెల్పీ) దాఖలు చేయడంతో ఆ అవార్డు అమల్లోకి రాలేదని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల నేరడి బ్యారేజీ పనులను ప్రారంభించడంలో జాప్యం చోటు చేసుకుని హిర మండలం రిజర్వాయర్‌ను నింపడం కష్టంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో గొట్టా బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి వంశధార జలాలను ఎత్తిపోసి హిర మండలం రిజర్వాయర్‌ నింపవచ్చునని ప్రతిపాదించారు. దీనికి వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సీఎం జగన్‌ ఈ ఎత్తిపోతలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనికి సుమారు రూ.189 కోట్లు వ్యయం కానుంది. నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.
► వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు అదనపు పరిహారం చెల్లింపుపై సీఎం జగన్‌ సమీక్షించారు. ఇందుకు దాదాపు రూ.226.71 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిధులు మంజూరు చేస్తూ మార్చిలోనే ఉత్తర్వులు జారీ చేశామని అధికారులు తెలిపారు.
► వంశధార ఫేజ్‌–2 స్టేజ్‌–2ను శరవేగంగా పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సీఎం మార్గనిర్దేశం చేశారు.
► గజపతినగరం బ్రాంచ్‌  కెనాల్, తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలన్నారు.

వలసలను నివారించేలా..
► తాగు, సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న రాయలసీమలో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి నీటి ఎద్దడిని నివారించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. కర్నూలు పశ్చిమ  ప్రాంత ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. నీటి కొరత కారణంగా ఈ ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని నివారించేందుకు ప్రాజెక్టులు దోహదం చేస్తాయన్నారు. 
► చిత్తూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు తాగు, సాగునీటిని అందించాలని, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.
► మిగిలిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు.
► భైరవానితిప్ప ప్రాజెక్టు, మడకశిర బైపాస్‌ కెనాల్, జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌ –2 (కోడూరు వరకు), జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ లిఫ్ట్‌ స్కీం, ఎర్రబల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం నుంచి యూసీఐఎల్‌ సప్లిమెంట్, రాజోలి, జలదిరాశి రిజర్వాయర్లు (కుందూ నది), రాజోలి బండ డైవర్షన్‌ స్కీం, వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం – 5 లిఫ్ట్‌ స్కీంలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. సమీక్షలో జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, జలవనరులశాఖ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు