నైపుణ్యాలను అలవర్చుకోవాలి: సీఎం జగన్‌

25 Mar, 2021 19:55 IST|Sakshi

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, పోస్టుల భర్తీ క్యాలెండర్‌పై సీఎం జగన్‌ సమీక్ష

అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు

ఈ ఏడాది 6 వేలకుపైగా పోలీస్‌ నియామకాలు

ఈ ఏడాది నుంచే తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు

సాక్షి, అమరావతి: అటానమస్‌ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యా శాఖమంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏపీఎస్‌సిహెచ్‌ఈ)  ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యారంగంలో మరో కీలక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంది. అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు చేసింది.

అటానమస్‌ కాలేజీలే సొంతంగా ప్రశ్నపత్నాలు తయారు చేసుకునే విధానం రద్దు
అన్ని కాలేజీలకీ జేఎన్‌టీయూ తయారుచేసిన ప్రశ్నపత్రాలే  
అటానమస్, నాన్‌ అటానమస్‌ కాలేజీలకు ఇవే ప్రశ్నపత్నాలు
వాల్యూయేషన్‌ కూడా జేఎన్‌టీయూకే
పరీక్షల్లో అక్రమాల నిరోధానికే చర్యలు

అందుకే ఈ నిర్ణయం: సీఎం వైఎస్‌ జగన్‌
సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలన్నారు. నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోలేమని.. ప్రతి విద్యార్థీ నైపుణ్యంతో, సబ్జెక్టుల్లో పరిజ్ఞానంతో ముందుకు రావాలన్నారు. ప్రతికోర్సుల్లో అప్రెంటిస్‌ విధానం తీసుకురావాలని అందుకే నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు.

‘‘కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు విలువ ఏముంటుంది. విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలి. కొత్త కొత్త సబ్జెక్టులను వారికి అందుబాటులో ఉంచాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యావిధానాన్ని పరిశీలించాలని’’ అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకువచ్చి.. ఆర్ట్స్‌లో మంచి సబ్జెక్టులను ఈ కాలేజీలో ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు.

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై సీఎం సమీక్ష
ఏప్రిల్‌ 9న జగనన్న విద్యాదీవెన  కింద ఫీజు
రీయింబర్స్‌మెంట్, ఏప్రిల్‌ 27న వసతి దీవెన విడుదలపై అధికారులతో సీఎం సమీక్ష
ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో  జగనన్న విద్యా దీవెన డబ్బులు
దాదాపు 10 లక్షలమందికిపైగా విద్యార్థులకు లబ్ధి
ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో 50వేల వరకూ పెరుగుదల వచ్చిందన్న అధికారులు
విద్యాదీవెన ద్వారా తల్లిదండ్రుల్లో చదువులకు ఇబ్బంది రాదనే భరోసా వచ్చిందన్న అధికారులు
అందుకనే గత ఏడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7లక్షలకు పెరిగిందని ముఖ్యమంత్రికి వెల్లడించిన అధికారులు

పోస్టుల భర్తీపై క్యాలెండర్‌
ఈ సంవత్సరం భర్తీచేయనున్న పోస్టులపై క్యాలెండర్‌ సిద్ధంచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉగాది రోజున క్యాలెండర్‌ విడుదలచేసేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. ఈ ఏడాది 6 వేలమంది పోలీసు నియామకాలు చేయాలని సీఎం ఆదేశించారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.
చదవండి:
‌‘ఉయ్యాలవాడ’ పేరుతో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు: సీఎం జగన్‌‌
సీఎం జగన్‌ ప్రకటన.. చిరంజీవి హర్షం

>
మరిన్ని వార్తలు