ధాన్యం సేకరించిన పక్షంలోగా చెల్లింపులు

5 Jan, 2021 04:22 IST|Sakshi
ధాన్యం సేకరణ, ఇంటి వద్దే నిత్యావసర సరుకులు పంపిణీపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం

గతంలో చెప్పినట్లుగానే రైతులకు 15 రోజుల్లోగా డబ్బులివ్వాలి: సీఎం జగన్‌

సేకరించిన ధాన్యం బకాయిలన్నీ సంక్రాంతి కల్లా పూర్తిగా చెల్లించాలి

ఫిబ్రవరి 1 నుంచి ఇంటివద్దే నిత్యావసర సరుకుల పంపిణీ

ఖరీఫ్‌ ధాన్యం సేకరణ, రేషన్‌ డోర్‌ డెలివరీపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష    

సాక్షి, అమరావతి: రైతుల నుంచి ధాన్యం సేకరించిన తరువాత గతంలో చెప్పినట్లుగానే 15 రోజుల్లోగా చెల్లింపులు జరపాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి సంక్రాంతి కల్లా రైతులకు బకాయిలను పూర్తిగా చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణ బిల్లులు పెండింగ్‌లో పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నిర్ణీత లక్ష్యం ప్రకారం ఖరీఫ్‌ ధాన్యం సేకరణ జరపాలని సూచించారు. ధాన్యం సేకరణ, ఇంటి వద్దే నిత్యావసర సరుకులు పంపిణీపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..

3వ వారంలో డోర్‌ డెలివరీ వాహనాలు ప్రారంభం..
ఇంటి వద్దే నిత్యావసర సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన ప్రత్యేక వాహనాలు ఈనెల 3వ వారంలో ప్రారంభమవుతాయి. అదే రోజు 10 కిలోల రైస్‌ బ్యాగ్స్‌ ఆవిష్కరణ ఉంటుంది. ఫిబ్రవరి 1వతేదీ నుంచి ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ మొదలవుతుంది. ఇందుకోసం 9,260 మొబైల్‌ యూనిట్లు, అధునాతన తూకం యంత్రాలు సిద్ధమయ్యాయి. 2.19 కోట్ల నాన్‌ ఓవెన్‌ క్యారీ బ్యాగులు రెడీగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు లక్ష్యానికి మించి నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాలను కేటాయించాం. ఎస్సీలకు 2,333, ఎస్టీలకు 700, బీసీలకు 3,875, ఈబీసీలకు 1,616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్‌ మైనారిటీలకు 85 వాహనాల కేటాయింపు జరిగింది. వాహనాల లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ ఇస్తుండగా 10 శాతం వాటాను వారు భరించాలి. 60 శాతం బ్యాంకు రుణం అందుతుంది. సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందచేస్తున్నాం. ప్రతి జిల్లాలో రుణాల మంజూరు క్యాంపులు నిర్వహిస్తున్నాం.  

>
మరిన్ని వార్తలు