విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలవాలి: సీఎం జగన్‌

1 Sep, 2021 16:17 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సమాచారం రైతులకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్‌బీకేలలో తగినంత ఫర్టిలైజర్‌ అందుబాటులో ఉండాలని సూచించారు. వ్యవసాయ శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌బీకే ఛానల్‌లో స్పెషలిస్ట్‌ సైంటిస్ట్‌ను భాగస్వామ్యం చేయాలని, స్మార్ట్‌ ఫోన్లలో ఆర్‌బీకే ఛానల్‌ యాప్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

చదవండి: సీఎం జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటన

చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. బోర్ల కింద, వర్షాధార భూములలో చిరు ధాన్యాలు సాగుచేసేలా ప్రోత్సహించాలన్నారు. వరికి బదులు చిరుధాన్యాలు సాగు చేసినా ఆదాయాలు బాగా వస్తాయన్న అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. అలా చేస్తున్న రైతులను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు సూచిందిచారు. చిరుధాన్యాల సాగుచేస్తున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా భరోసా కల్పించాలని, దాని వల్ల రైతులు మరింత ముందుకు వస్తారని తెలిపారు.

వ్యవసాయ సలహామండలి సమావేశాలు
వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు జరుగుతున్న తీరుపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. రైతులతో ఏర్పడ్డ వ్యవసాయ సలహామండళ్లలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, సమస్యలు నేరుగా కలెక్టర్ల దృష్టికి వెళ్లాలన్నారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రైయిన్లు సహా ఇరత్రా పనులపై ఇప్పుడే వివరాలు తెప్పించుకుని దీనికి తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైతులు చెప్తున్న సమస్యలను తీర్చే బాధ్యత కచ్చితంగా అధికారులు తీసుకోవాలని, దానిపై దృష్టి పెట్టాలలని సీఎం జగన్‌ అన్నారు. వ్యవసాయ సలహామండళ్ల కారణంగా సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. సుమారు లక్ష మందికిపైగా రైతులు వ్యవసాయ సలహామండళ్లలో ఉన్నారని అధికారులు తెలిపారు.

రైతు భరోసా కేంద్రాలు-సేవలు
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. రైతు భరోసాకేంద్రాల పనితీరు, సామర్థ్యం ఆమేరకు మెరుగుపడాలన్నారు. నాణ్యత ఉన్నవాటిని రైతులకు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా కూడా రైతుల సమస్యలు నేరుగా ఉన్నతస్థాయికి తెలిసే వ్యవస్థను కూడా సిద్ధం చేయాలని తెలిపారు. అత్యాధునిక పరిజ్ఞానాన్ని (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) దానికి వినియోగించుకోవాలని పేర్కొన్నారు. నేచురల్‌ ఫార్మింగ్‌పైనా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నేచురల్‌ ఫార్మింగ్‌ విధానాలను డిస్‌ప్లే చేయాలని సూచించారు. దానికి సంబంధించిన సామగ్రి కావాలంటే వెంటనే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.

ఆర్బీకే కేంద్రాలకు అనుబంధ భవనాలను విస్తరించుకుంటూచిన్నపాటి గోడౌన్లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను అదేశించారు. అక్కడే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిల్వచేసుకోవచ్చన్నారు. భవనాలను విస్తరించి నిర్మించేంతవరకూ అద్దె ప్రాతిపదికన కొన్ని భవనాలు తీసుకోవాలని సూచించారు. ఆర్బీకేల పనితీరుమీద కూడా సర్టిఫికెషన్‌ ఉండాలన్నారు. ఆర్బీకేల పనితీరుపె నిరంతర పర్యవేక్షణ, సమీక్ష ఉండాలని పేర్కొన్నారు. ఆర్బీకేల పనితీరును మెరుగుపరిచే దిశగా ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ పొందే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. దానివల్ల వాటి పనితీరు క్రమంగా మెరుగుపడుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు ఎస్‌ఓపీలను రూపొందించుకోవాలని తెలిపారు.

వైఎస్సార్‌ పొలంబడి
వైఎస్సార్‌ పొలంబడి కార్యక్రమంపైనా సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. పొలంబడి కార్యక్రమాల షెడ్యూలును రైతు భరోసాకేంద్రాల్లో ఉంచాలని అధికారులను ఆదేశించారు.15 రకాల పంటలపై పొలంబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అగ్రికల్చర్‌ కాలేజీలు, యూనివర్శిటీ విద్యార్థులు ఆర్బీకేల్లో విధిగా పనిచేసేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

ఆర్గానిక్‌ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌
ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ వచ్చేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మోతాదుకు మించి అధికంగా ఎరువులు, పురుగు మందులు వాడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆర్బీకే యూనిట్లుగా మ్యాపింగ్‌ చేసి అక్కడ రైతులకు పొలం బడుల ద్వారా ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు తెలిపారు. పంటల సాగులో రైతులకు అవగాహన కల్పించేలా రూపొందించిన వీడియోలను యాప్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

ఇ-క్రాపింగ్‌పైనా సీఎం సమీక్ష
ఇ-క్రాపింగ్‌ చేసిన రైతులకు భౌతిక రశీదులు, డిజిటల్‌ రశీదులు కూడా ఇవ్వాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఇ-క్రాపింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దానివల్ల పూర్తి పారదర్శకత వస్తుందని తెలిపారు.రుణాలు, సున్నా వడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంటల కొనుగోలు, బీమా.. తదితర వాటన్నింటికీ ఇ-క్రాపింగ్‌ ఆధారం అవుతుందని సీఎం పేర్కొన్నారు. అన్ని ఆర్బీకేల్లో బ్యాకింగ్‌ కరస్పాండెంట్లు ఉండాలని, కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో భారీ పరికరాలను, సామగ్రిని అందుబాటులో ఉంచడమే కాకుండా ప్రతి ఆర్బీకే పరిధిలో కూడా రైతులకు అవసరమైన పనిముట్లను వ్యక్తిగతంగా అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వచ్చే రబీ సీజన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. 

ట్రాన్స్‌ఫార్మర్‌ల సమస్యలు-పరిష్కారం
ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినా వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయిన చోట లోడ్, ఇతరత్రా పరిస్థితులపై వెంటనే పరిశీలన చేయాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడానికి కారణాలపైన కూడా అధ్యయనం చేయాలని, లేకపోతే కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టినా ఉపయోగం ఉండదన్నారు. మీటర్లు అమర్చడం ద్వారా ఎంత కరెంటు కాలుతుంది, ఎంత లోడ్‌ పడుతుందనే విషయం తెలుస్తుందన్నారు. మీటర్ల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న విషయం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశామని తెలిపారు. మీటర్ల వల్ల ఓ వర్గ మీడియాకు తప్ప, రైతులెవ్వరికీ నష్టం లేదన్నారు. ఈ విషయాన్ని రైతులు కూడా గుర్తించి మీటర్లు పెట్టించుకునేందుకు ముందుకు వచ్చారని గర్తు చేశారు. ఎంత బిల్లు కట్టాలో అంత డబ్బునూ ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లోకి వేస్తోందని, ఆ డబ్బు నేరుగా కరెంటు పంపిణీ సంస్థలకు చేరుతోందని సీఎం జగన్‌ తెలిపారు.

ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, ఏపీ స్టేట్‌ ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుక్కపట్నం నవీన్‌ నిశ్చల్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, జెడ్‌బీఎన్‌ఎఫ్‌ స్పెషల్‌ సీఎస్‌ టి.విజయ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ పి.ఎస్‌.ప్రద్యుమ్న, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ వీసీ మరియు ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇవీ చదవండి:
ఏపీ: ఈ–కేవైసీ గడువు 15 వరకు పొడిగింపు 
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయని లోకేశ్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు