ఏపీ @ గ్రీన్‌ ‘పవర్‌’

23 Jun, 2022 02:09 IST|Sakshi

కాలుష్యానికి దూరంగా పెద్ద ఎత్తున విద్యుదుత్పత్తిపై దృష్టి 

ఏపీలో 30 వేల మెగావాట్లకు పైగా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి అవకాశాలు

స్థానికంగా భారీ ఉపాధి.. ప్రతి 3 మెగావాట్లకు ఒక జాబ్‌

భూములిచ్చే రైతులకు ఏటా ఎకరానికి రూ.30,000 లీజు

మొత్తం 90 వేల ఎకరాలు అవసరం.. అందరూ అంగీకరిస్తేనే

నీటి వసతి లేనివి, సేద్యానికి అనుకూలం కాని చోట్ల గ్రీన్‌ ప్రాజెక్టులు   

రైతులకు స్థిరమైన ఆదాయం.. ఆర్థిక వ్యవస్థకు ఊతం 

3,700 మెగావాట్ల అదానీ గ్రీన్‌ఎనర్జీ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు సీఎం జగన్‌ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం

నాలుగు దశల్లో రూ.15,376 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ గ్రూప్‌   

సాక్షి, అమరావతి: ప్రకృతి ప్రసాదించిన వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఇటు కాలుష్య రహితమైన విద్యుదుత్పత్తి.. అటు అన్నదాతలకు ఆర్థిక లాభం.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. భౌగోళిక పరిస్థితుల అనుకూలత కారణంగా రాష్ట్రంలో 30 వేల మెగావాట్లకు పైగా పవన్, సౌర విద్యుత్తు లాంటి గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి అపార అవకాశాలున్న నేపథ్యంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది.

ఉదాహరణకు ప్రకాశం, పశ్చిమ కృష్ణా, రాయలసీమ తదితర చోట్ల సేద్యానికి అంతగా అనుకూలం కానివి, నీటి వసతి లేని భూములను వినియోగించుకోనున్నారు. గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం భూములిచ్చేందుకు ముందుకొస్తే ఎకరానికి ఏటా రూ.30,000 చొప్పున లీజు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి కంపెనీలను సంప్రదించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం సుబాబుల్, జామాయిల్‌ తదితరాలను సాగు చేస్తున్న రైతులకు పెద్దగా కౌలు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు.

ఈ పరిస్థితులను నివారించే లక్ష్యంతో గ్రామాలకు వెళ్లి రైతులకు లభించే ఆర్థిక ప్రయోజనాలను వివరించి వారంతా అందుకు అంగీకరిస్తే భూమి సమీకరిస్తారు. ఇందుకు దాదాపు 90 వేల ఎకరాలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఒకపక్క రైతులకు స్థిరమైన ఆదాయంతో ఆర్థికంగా లాభం చేకూరడంతోపాటు స్థానిక యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రతి 3 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఒక ఉద్యోగం చొప్పున అందుబాటులోకి రానుంది. తద్వారా అన్నదాతలు బాగుపడటంతోపాటు ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకోనుంది.
ఎస్‌ఐపీబీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

రూ.15,376 కోట్లతో అదానీ  
అదానీ గ్రీన్‌ ఎనర్జీ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది.

బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధితో పాటు మల్లవల్లిలో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్, తిరుపతిలో నోవాటెల్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్,  కొప్పర్తి వద్ద పంక్చుయేట్‌ గార్మెంట్స్‌ యూనిట్‌కు ఎస్‌ఐపీబీ ఆమోదముద్ర వేసింది.

నాలుగు చోట్ల.. 4 వేల మందికి అదానీ ఉపాధి
దావోస్‌లో జరిగిన ఆర్థిక సదస్సులో కుదిరిన ఒప్పందం మేరకు అదానీ గ్రీన్‌ ఎనర్జీ పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టును ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. సుమారు రూ.15,376 కోట్ల పెట్టుబడితో 3,700 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఏర్పాటు చేయనుంది. మొత్తం నాలుగు దశల్లో నాలుగు చోట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి.

వైఎస్సార్‌ జిల్లాలో 1,000 మెగావాట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుకుట్టి వద్ద 1,200 మెగావాట్లు, కర్రివలస వద్ద 1,000 మెగావాట్లు, సత్యసాయి జిల్లాలోని పెద్దకోట్ల చిత్రావతి వద్ద 500 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. 2022–23లో రూ.1,349 కోట్లు, 2023–24లో రూ.6,984 కోట్లు, 2024–25లో రూ.5,188 కోట్లు, 2025–26లో రూ.1,855 కోట్ల చొప్పున వ్యయం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4 వేలమందికి ఉపాధి లభించనుంది.

కొప్పర్తిలో టెక్స్‌టైల్‌ పార్క్‌
ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగానికి చిరునామాగా మారిన  కొప్పర్తిలో టెక్స్‌టైల్‌ రంగంలోనూ భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం సుమారు 1200 ఎకరాల్లో మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్, అపరెల్‌ పార్క్‌ అభివృద్ధి చేయనున్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ద్వారా గరిష్ట సంఖ్యలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అప్పరెల్‌ పార్క్‌ అభివృద్ధి చేస్తున్నారు.

నాణ్యమైన విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. సరకు రవాణా వేగంగా జరిగేలా ఈ ప్రాంతాన్ని రైల్వేలైన్లతో అనుసంధానించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. దీంతోపాటు వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో పంక్చుయేట్‌ వరల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టెక్స్‌పోర్ట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ) రూ.50 కోట్లతో స్థాపించే గార్మెంట్స్‌ తయారీ పరిశ్రమకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇదే కంపెనీ కొప్పర్తిలో రూ.50 కోట్లతో నెలకొల్పే మరో యూనిట్‌కూ ఆమోదం లభించింది. ఈ రెండు యూనిట్ల ద్వారా మొత్తం 4,200 మందికి ఉపాధి లభించనుంది.

తిరుపతిలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌
తిరుపతిలో వీవీపీఎల్‌ సంస్థ నోవాటెల్‌ బ్రాండ్‌ కింద ఏర్పాటు చేయనున్న ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.126.48 కోట్లతో ఏర్పాటయ్యే ఈ హోటల్‌ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 2,700 మందికి ఉపాధి లభించనుంది. కృష్ణా జిల్లా మల్లవల్లి ఫుడ్‌పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నెలకొల్పే రొయ్యల ప్రాసెసింగ్‌ పరిశ్రమకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 

కొప్పర్తికి రైల్వే లైన్‌!
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీల ఉత్పత్తుల తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. ఎలక్ట్రానిక్స్‌. పర్యాటక– ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలున్నాయని చెప్పారు. ‘కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమలు విరివిగా వస్తున్నాయి. మరిన్ని అంతర్జాతీయ కంపెనీలను రప్పించాలి.

ఈ పరిశ్రమలకు అవసరమైన సామగ్రి, ఉత్పత్తులను సులభంగా తరలించేందుకు వీలుగా కొప్పర్తిలో రైల్వే లైన్‌ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల కొప్పర్తి ప్రాంతంలో దాదాపు 6 వేల ఎకరాల్లో వేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దీంతోపాటు ఇండస్ట్రియల్‌ నోడ్స్‌ను రైల్వేలతో అనుసంధానం చేయడం అత్యంత కీలకం, ప్రతి నోడ్‌ను రైల్వేలైన్లతో అనుసంధానించేలా కృషి చేయాలి. తద్వారా పరిశ్రమలకు మంచి జరుగుతుంది.  రవాణా సులభతరం అవుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలి’ అని సమావేశంలో సీఎం సూచించారు.

హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు
ఎస్‌ఐపీబీ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కే రోజా, సీఎస్‌ సమీర్‌ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులతో రైతులకు మేలు 
రాష్ట్రంలో 30 వేల మెగావాట్లకు పైగా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయని ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం జగన్‌ పేర్కొన్నారు. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల వల్ల రైతులు, రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందన్నారు. దీనికోసం సుమారు 90 వేల ఎకరాలు అవసరం అవుతాయన్నారు. ప్రతి ఎకరాకు రైతుకు ఏటా కనీసం రూ.30 వేలు లీజు కింద ఆదాయం నేరుగా వస్తుందని తెలిపారు.

వర్షాభావ ప్రాంతాల్లో స్థిరమైన ఆదాయం రావడం వల్ల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. సుబాబుల్, జామాయిల్‌ సాగు చేస్తున్న రైతులకు కూడా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆ భూములను గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా స్థిరమైన ఆదాయం పొందేందుకు చక్కటి అవకాశం దక్కుతుందన్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించి రైతులకు మేలు జరిగేలా చర్యలను చేపట్టాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు