చెవిటి–మూగ వైకల్య రహిత రాష్ట్రమే లక్ష్యం

17 Feb, 2021 03:18 IST|Sakshi
కాక్లియర్‌ ఇంప్లాట్, డెఫ్‌ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుపై క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చిన్నారులు, విద్యార్థులకు కంటి వెలుగు తరహాలో పరీక్షలు 

అవసరమైతే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు

ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌    

బాధిత పిల్లల్లో ఇలాంటి లోపాలను ముందుగానే గుర్తించాలి 

ఆపరేషన్లకు వసతుల కల్పన, పరికరాలపై దృష్టి సారించాలి 

పాదయాత్రలో నా వద్దకు వచ్చిన 100 మందికి పైగా పిల్లలకు ఆపరేషన్లు పూర్తి 

ఇలాంటి వైకల్యంతో బాధపడే వారికి అండగా ఉండటమే ధ్యేయం   

అప్పుడే పుట్టిన శిశువులు, విలేజ్‌ క్లినిక్‌లకు వచ్చే చిన్నారులు, స్కూలు విద్యార్థులలో చెవిటి – మూగ లోపాలను ముందుగానే గుర్తించ డానికి పరీక్షలు నిర్వహించాలి. ‘కంటి వెలుగు’ తరహాలో స్క్రీనింగ్‌ చేయాలి. అప్పుడే అవగాహన, చైతన్యం కలిగించగలుగుతాం. ఆ తర్వాత అవసరమైన వారికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ చేయిస్తాం. ఈ మేరకు చర్యలు తీసుకోవాలి. లేదంటే వారి జీవితం అంధకారంగా ఉంటుంది.

వినికిడి సమస్యపై స్క్రీనింగ్‌ నిర్వహించేందుకు, ఆ తర్వాత అవసరమైన పిల్లలకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు చేయించేందుకు తగిన పరికరాలు, మౌలిక సదుపాయాలు, వాటి నిర్వహణ విధానంపై దృష్టి పెట్టాలి. ఈ సమస్యపై విదేశాల్లో అనుసరిస్తున్న విధానాలపై దృష్టి సారించడంతో పాటు, కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ చేసే సదుపాయం ప్రతి బోధనాసుపత్రిలో ఉండాలి. ఈ మేరకు ప్రతి దశలోనూ ఎస్‌వోపీ (స్టాండర్ట్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) తయారు చేయాలి. 

సర్జరీ అవసరం లేని వారికి అందించాల్సిన పరికరాల గురించి కూడా ఆలోచించాలి. అవ్వాతాతలు కూడా వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. వారికి కూడా పరికరాలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలి. కోవిడ్‌ కారణంగా నిలిచిపోయిన కంటి వెలుగు ఆపరేషన్లను పూర్తి చేయాలి.

సాక్షి, అమరావతి: చెవిటి–మూగ వైకల్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కంటి వెలుగు తరహాలో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు చేయాలని స్పష్టం చేశారు. బాధితుల్లో ఇలాంటి లోపాలను ముందుగా గుర్తించి, వారికి వీలైనంత త్వరగా ఆపరేషన్లు చేయాలని సూచించారు. పాదయాత్రలో కనీసం 100 మంది పిల్లలు తన దగ్గరకు వచ్చారని, వారందరికీ ఆపరేషన్లు చేయించామని వెల్లడించారు. ఇలాంటి వైకల్యంతో బాధపడే వారికి అండగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

కాక్లియర్‌ ఇంప్లాంట్, డెఫ్‌ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చెవిటి – మూగ వైకల్యం నివారించడానికి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. చిన్నారులకు వివిధ దశల్లో నిర్వహించే వ్యాక్సినేషన్‌ కార్యక్రమంతో పాటే ఈ పరీక్షలను అనుసంధానం చేయాలని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలతో వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించి తగిన విధంగా వైద్యం చేయించే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

పూర్తి స్థాయిలో స్క్రీనింగ్‌ 
► ఎంఆర్‌ఐ కంపాటిబిలిటీ, ఆధునిక పరిజ్ఞానం సహాయంతో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలను నిర్వహించే విషయమై సమావేశంలో చర్చించారు. పూర్తి స్థాయిలో స్క్రీనింగ్‌ నిర్వహించి, లోపాలు గుర్తించిన వారికి పూర్తి స్థాయి వైద్యం, ఆపరేషన్లు చేయించడంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఉండాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 
► శిశువులకు 1వ నెల, 3వ నెల, 6వ నెలల్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. పీహెచ్‌సీలు, 104లలో కూడా పరీక్షలు చేసేందుకు పరికరాలు అందుబాటులో ఉంచే విషయం ఆలోచించాలని, పరీక్షలు చేశాక లోపాలు లేకపోతే, ఆ మేరకు సర్టిఫై చేయాలని సీఎం సూచించారు. 
► కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలను దేశంలో తొలిసారిగా ప్రారంభించిన ఘనత ఏపీకే దక్కుతుందని, ఏపీ సీఎం జగన్‌.. వినికిడి – మూగ లోపాలతో బాధ పడుతున్న చిన్నారులకు అండగా నిలుస్తున్నారనే ప్రశంసలు అందుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
► ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ మల్లికార్జున, సొసైటీ టు ఎయిడ్‌ ద హియరింగ్‌ ఇంపెయిర్డ్‌ (సాహి) సెక్రటరీ డాక్టర్‌ ఈసీ వినయ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు