వరదలు: సహాయ చర్యలపై సీఎం జగన్‌ ఆరా

23 Oct, 2020 16:11 IST|Sakshi

సాక్షి, అమరావతి : తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటీవల సంభవించిన వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. వరద పరిస్థితి, సహాయ చర్యలపై ఆరా తీశారు. వరదలు, భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల గురించి మంత్రి కన్నబాబు సీఎం జగన్‌కు వివరించారు. తక్షణ సహాయంతో పాటు శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారంపై అధికారుల నుంచి నివేదిక కోరారు. దీనిపై వచ్చే వారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. (సమగ్ర భూ సర్వేతో శాశ్వత భూ హక్కు)

40 వేల హెక్టార్లలో వరిపంటకు నష్టం
కాగా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కన్నబాబు ఇదివరకే పర్యటించిన విషయం తెలిసిందే. వ‌ర‌దల కార‌ణంగా ఇప్పటివ‌ర‌కు జిల్లాలో 40 వేల హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లింద‌ని మంత్రి తెలిపారు. వ‌ర‌ద‌ల‌తో గండ్లు ప‌డిన ప్రాంతాల‌ను ప‌రిశీలించి దీనికి శాశ్వత పరిష్కారం చూపుతామ‌ని పేర్కొన్నారు. గండ్లు పడిన చోట పూడ్చివేత పనులు చేపట్టాలని అధికారుల‌ను ఆదేశించారు. ఏలేరు వరదలతో పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఉద్యానవన పంటలు కుళ్లిపోయిన పరిస్థితి, తీవ్రంగా ఉంద‌ని తెలిపారు. పంట న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందజేశామ‌ని తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహాయక చర్యల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్నారని మంత్రి  వెల్ల‌డించారు.

మరిన్ని వార్తలు