జీతాలు కొంత పెరిగే విధంగానే ఫిట్‌మెంట్‌

21 Dec, 2021 05:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇవ్వడం ద్వారా వస్తున్న జీతం కంటే ఫిట్‌మెంట్‌ అమలు తర్వాత జీతం తగ్గకుండా, కొంత పెరిగేలా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉద్యోగుల జీతాలు తగ్గకపోగా, కొంత పెరుగుతాయని చెప్పారు. ఇది ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని, ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్‌ సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చారని గుర్తు చేశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్‌) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, సజ్జల తదితరులతో పీఆర్సీపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

(చదవండి: ప్రజానేతకు పట్టంకట్టిన ప్రజలు)

సమావేశం అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సెక్రటరీల కమిటీ సిఫార్సులు అమలు చేస్తే వేతనం తగ్గుతుందన్న ఉద్యోగుల అనుమానాలను నివృత్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారని తెలిపారు. అధికారులు సూచించిన ఫిట్‌మెంట్‌ అయితే ఇప్పుడు వస్తున్న జీతంకంటే తగ్గుతుందని, అలా జరగకుండా కసరత్తు చేయాలని సీఎం సూచించారని చెప్పారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన అంశాన్ని ఉద్యోగులకు సెక్రటరీల కమిటీ వివరించిందని తెలిపారు. ఆర్థికేతర అంశాలను రెండ్రోజుల్లోగా పరిష్కరించేందుకు మంగళవారం నుంచే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్‌ నేతృత్వంలోని సెక్రటరీల కమిటీ సమావేశమవుతుందని తెలిపారు. 

చదవండి: ముఖ్యమంత్రి ఆరాటం.. మేలు చేయాలనే 

మరిన్ని వార్తలు