ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్‌ సమీక్ష

25 Aug, 2020 15:27 IST|Sakshi

పనులు వేగంగా జరగాలి

కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఎరువులు పంపిణీ చేయండి

ఇ- క్రాపింగ్‌ పూర్తిచేయండి

వివిధ అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, తాడేపల్లి: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. రూ.22వేల కోట్ల విలువైన ఆస్తులను.. 30లక్షల మంది అక్కాచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ సహా వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

కాగా టీడీపీ నాయకుల తీరు కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ఆ సమస్యలను అధిగమించేందుకు వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోంది. కొంత సమయం పట్టినా చివరకు న్యాయమే గెలుస్తుంది’’ అని పేర్కొన్నారు.(చదవండికోవిడ్‌ చికిత్సలకు అధిక రేట్లు.. సీఎం జగన్‌ సీరియస్‌)

పనులు వేగంగా జరగాలి: సీఎం జగన్‌
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రతి జిల్లాలో ప్రతి వారం రూ.10 కోట్ల మెటీరియల్ కాంపౌనెంట్ పనులు జరగాలి. పనులు వేగంగా జరగాలి’’అని ఈ సందర్బంగా అధికారులను ఆదేశించారు. అదే విధంగా పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమంపై సమీక్ష సమావేశంలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ పాఠశాలను వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూల్స్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 55వేల అంగన్‌వాడీల్లో నాడు-నేడు కింద పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంపై కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు తెరవాలనే ఆలోచన ఉన్నందున.. అంతకంటే ముందే వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.(చదవండి: అవినీతిపై బ్రహ్మాస్త్రం)

వైఎస్సార్‌ చేయూత, స్వయం సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ ద్వారా ఆర్థిక సహాయం అందించామని.. బ్యాంకులకు ఈ డబ్బుపై ఎలాంటి హక్కు లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు వస్తే కలెక్టర్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలకు స్థిరమైన జీవనోపాధి మార్గాలను చూపడానికి.. హిందూస్థాన్‌, యూనిలీవర్, ఐటీసీ, పీ&జి, రిలయన్స్, అమూల్‌.. అలానా గ్రూపులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్న ముఖ్యమంత్రి.. రాష్ట్ర స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి మంత్రుల బృందం రివ్యూ చేస్తుందని తెలిపారు. మహిళలు ఎంపిక చేసుకున్న జీవనోపాధి మార్గాల్లో చేయూతనివ్వాలని.. వారికి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. (చదవండి:‘ చేయూత’తో స్వయం సమృద్ధి)

ఎరువులు పంపిణీ చేయండి: సీఎం జగన్‌
మండలాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఎరువులు పంపిణీ చేయాలని సీఎం జగన్‌ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా నూటికి నూరు శాతం ఇ-క్రాపింగ్ పూర్తి చేసి.. వ్యవసాయ యాంత్రీకరణపై కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘‘రైతుల గ్రూపులను ఏర్పాటు చేసి యంత్రాలను డెలివరీ చేయాలి. మండల స్థాయిలో కూడా రైతులతో గ్రూపులను ఏర్పాటు చేయాలి. వర్షాలు బాగా పడినందున ఎరువుల డిమాండ్ పెరుగుతుంది. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులను పంపిణీ చేయాలి. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో ఒక ఎకరా భూమిని గుర్తించాలి’’అని ఆదేశించారు. ‘‘మల్టీపర్పస్ ఫెసిలిటీస్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా గోడౌన్లు, పంట ఆరబెట్టుకోవడానికి ప్లాట్‌ ఫాం, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు.. పశువుల శాఖ, కలెక్షన్ సెంటర్ కార్యకలాపాల కోసం వసతులు ఏర్పాటు చేయనున్నాం’’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు